మహిళా సాధికారత కోసం పార్లమెంట్ లో చట్టం(WOMEN EMPOWERMENT BILL IN TELUGU):

పరిచయం:

మహిళా రిజర్వేషన్ బిల్లునే, రాజ్యాంగం 108వ సవరణ బిల్లు అనీ అనవచ్చు.  9 మార్చి, 2010, భారత పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదించబడింది. మహిళా బిల్లు సారాంశం ఏమిటంటే, లోక్ సభలోనూ, రాష్ట్రాలలోని అసెంబ్లీలలోనూ మూడవ వంతు సీట్లు మహిళలకు కేటాయింపబడి ఉండాలి. అంటే రిజర్వ్ చేయబడి ఉండాలి. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చేయాలి. స్థూలంగా ఇదీ బిల్ సారాంశం. తరువాత మరుగున పడిపోయింది. అది వేరే అంశం. మార్చి 2023లో, మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకురాలు కె. కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లు మళ్లీ వెలుగులోకి వచ్చింది.


రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్:
మహిళా రిజర్వేషన్ అంశం స్వాతంత్య్ర పోరాటం నాటి నుంచి ఉంది. రాజ్యాంగ పరిషత్ చర్చల సమయంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కానీ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఐతే ఇప్పటికీ, స్వాతంత్య్రానంతర దశాబ్ధాల నుండి రాజకీయాలను గమనిస్తూ వస్తే, చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యంలో ఎటువంటి మెరుగుదల లేదు.
పైగా సంఖ్య తగ్గుతూనే వస్తోంది.
 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన మొత్తం సీట్లలో, మూడింట ఒక వంతు సీట్లు ఆయా వర్గాల మహిళలకు లోక్‌సభ, శాసన సభలలో రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఏదైనా రాష్ట్రంలో కానీ, కేంద్రపాలిత ప్రాంతంలో కానీ ఆయా  నియోజకవర్గాలకు, రొటేషన్ పద్ధతి ద్వారా రిజర్వ్డ్ సీట్లను కేటాయించవచ్చు. ఇందులో కీలకమైన విషయం ఏమిటంటే, ఈ సవరణ చట్టం ప్రారంభమైన 15 సంవత్సరాల తర్వాత మహిళలకు సీట్ల రిజర్వేషన్ ఉండదు. అంటే ఈ బిల్లు మహిళలకు 15 సంవత్సరాలకు గానూ అవకాశం కల్పిస్తోంది. 
కీలక సమస్యలు,
విశ్లేషణ:
మహిళా రిజర్వేషన్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల పరిస్థితిని  మెరుగుపరచడానికి తీసుకోవలసిన  చర్యఆవశ్యకతను రాజకీయనాయకులు, సంస్కర్తలు అందరూ కూడా నొక్కి చెప్తున్నారు. పంచాయతీలపై ఇటీవలి కాలంలో జరిపిన అధ్యయనాల ఆధారంగా చూస్తే, మహిళల సాధికారత, వనరుల కేటాయింపు లాంటి అంశాలపైన రిజర్వేషన్ విధానం సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఇందులో మెజారిటీ స్థానాలు మహిళలు మెరిట్‌పై పోటీ చేసి గెలుచుకున్నవి. వర్తమానంలో బీహార్ లో అధిక శాతం మహిళలు తమ తమ నియోజక వర్గాలకు ప్రతినిధ్యం వహిస్తున్నారు(243కు గానూ 34), తరువాతి స్థానాలలో రాజస్థాన్, వెస్ట్ బంగాల ఉన్నాయి. చిత్రంగా మహిళల ప్రతినిధ్యం 10% కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, ఒడిష, సిక్కిం, తమిళనాడు తదితరాలు. ఇవే సీట్లను రిజర్వ్ చేయటం ద్వారా రాజకీయాలను నేరపూరితం చేయడం, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బ తినటం వంటివి జరుగుతాయని ప్రత్యర్థుల వాదన. అంతే కాక  ఎన్నికల సంస్కరణ, ఆచరణ వంటి వాటి నుండి కూడా ఈ విధానం దృష్టిని మళ్లిస్తుందని కూడా వారి వాదన.
సీట్ల రిజర్వేషన్ విధానం, ఓటర్లను ప్రభావితం చేయటమే కాక పరిమితం కూడా చేస్తుంది. దీనికి పరిష్కారం నిపుణులు, రాజకీయ పార్టీలు చెప్పేది ఏమిటంటే, నియోజకవర్గాలలో రిజర్వేషన్లకు రొటేషన్ పద్ధతిని పాటించడం. ప్రతి ఎన్నికలలో రిజర్వ్డ్ నియోజకవర్గాలను మార్చడం వలన ఒక MP తన నియోజకవర్గం కోసం పని చేయడానికి ప్రోత్సాహాన్ని పొందుతాడు. ఎందుకంటే రొటేషన్ విధానం వలన అతను ఆ నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నిక కావడానికి అర్హ పొందవచ్చు.
1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన నివేదిక, ఇతర వెనుకబడిన తరగతుల(OBC)కు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత OBC మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. అయితే
ఈ సిఫార్సులు బిల్లులో పొందుపరచబడలేదు. 
పార్లమెంటులో వాదనలు:
బిల్లుకు అనుకూలంగా కొన్ని వాదనలు విన వచ్చాయి. ఇవి సానుకూలంగానూ, నిర్మాణాత్మకంగానూ ఉన్నాయి. అంతేకాక వాదనలో దూరదృష్టి, సాపేక్షత ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవి నిజంగా మహిళల అభ్యున్నతి కోరేవి. రాజకీయ పార్టీలు సహజంగా పితృస్వామ్యమైనవి.  అందువలన పార్లమెంట్‌లో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి రిజర్వేషన్ల రూపంలో నిర్ణయాత్మక చర్య అత్యంతావశ్యకం. పార్లమెంట్‌లో మహిళలకు అధిక ప్రాతినిథ్యం కల్పించడం వల్ల మహిళా సమస్యలపై మరింత ప్రభావవంతంగా చర్చ జరుగుతుంది. నేటికీ, భారతదేశంలోని మహిళలు మెజారిటీ అంశాలలో పురుషుల కంటే వెనుకబడి ఉన్నారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ 2023 ప్రకారం, 146 దేశాలలో భారతదేశం ఇండెక్స్ లో 127వ స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం, రాజకీయ సాధికారత లింగాంతరంగాన్ని తెరమరుగు చేయటానికి భారత్ లో మరో 160 సంవత్సరాలు పడుతుంది. మొత్తం పార్లమెంటేరియన్ల సంఖ్యలో 15% మహిళలు ప్రాతినిధ్యం వహించడంతో గత సంవత్సరాలతో పోలిస్తే రాజకీయ సాధికారత అనేది స్వల్ప సకరాత్మకతను మాత్రమే సాధించింది. పంచాయతీ నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు తమ భర్తలకు లేదా తండ్రులకు రబ్బరు స్టాంపులుగా పరిగణింపబడుతున్నప్పటికీ, విధానాలలో పెద్ద మార్పు కనిపించినట్లు నివేదిక తెలుపుతోందిమహిళా అభ్యర్థులు తమ ఓటర్లకు అందుబాటులో ఉన్నారు, మద్యం సమస్యను చాలా వరకు నియంత్రించారు. తమ ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అవినీతిని అరికట్టారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు, దేశంలోని అస్తవ్యస్తంగా ఉన్న లింగ నిష్పత్తి, తక్కువ పోషకాహార స్థాయిలు మొదలైన సమస్యలను పరిష్కరించడానికి మకు నిర్ణయాత్మక పాత్ర కావాలని అధిక శాతం మహిళలు వాదించారు.

మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేక వాదనలు:
మహిళా రిజర్వేషన్ బిల్లును కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని సమానత్వ సూత్రానికి విరుద్ధం.
కుల సమూహాల్లాగా, మహిళల స్వజాతీయ సమూహాన్ని ఏర్పరచడం సమ్మతం కాదు. కాబట్టి మహిళా రిజర్వేషన్ కులాధారితంగానైతే సమ్మతం. ఎందుకంటే స్వజాతిని, కులాన్ని సమానంగా చూడలేం, అంతేకాక రెండింటికీ ఒకే వాదన కూడా
చేయలేము.
పార్లమెంటులో సీట్ల రిజర్వేషన్ వల్ల మహిళా అభ్యర్థులకు ఓటర్ల సంఖ్య పరిమితమౌతుందని వాదిస్తున్నారు.
ఈ వాదన రాజకీయ పార్టీలలోనే మహిళలకు రిజర్వేషన్లు, ద్వంద్వ-సభ్య నియోజకవర్గాలు (ఇక్కడ ఇద్దరు ఎంపీలు ఉంటారు, వారిలో ఒకరు మహిళ) వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల సూచనలు కూడా చేయబడ్డాయి.
ఏది ఏమైనప్పటికీ, రాజకీయ పార్టీలు గెలవలేని స్థానాల నుండి మహిళలను పోటీ చేయించవచ్చు. లేదా వారు పోటీ చేసే స్థానాల నుండి అస్సలు గెలవకపోవచ్చు. ఏ విధంగా చూసినా ఇది పార్టీకి ఎదురుదెబ్బగా మారుతుంది.
 
ఉపసంహారం:
పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ అనేది ఒక వివాదాస్పద అంశం. మొత్తంగా రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం అనేది అత్యంత ప్రాముఖ్యం అన్న విషయాన్ని కూడా కొట్టిపారేయలేం. విధాన రూపకల్పనలో మహిళల సమస్యలు మరింత ప్రభావవంతంగా చర్చించబడటానికి మహిళా ప్రాతినిధ్యం పెరగటం అన్నది అత్యంత ఆవశ్యకం.