మధ్యతరగతి మరియు వినియోగదారువాదం.(madhyataragati mariyu viniyogadaruvadam)(Middle class and Consumerism):

పరిచయం: 

IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) గణాంకాల ప్రకారం భారతదేశం ఎదుగుతున్న దేశాల సరసన ఉన్నా, వృద్ధి రేటు మాత్రం 5 గా ఉన్నది. ఇది తొందరలో 4వ, స్థానాన్ని ఆక్రమించవచ్చు. దీనికి కారణాలు కొన్నే అయినా  బలమైనవి. సుదీర్ఘమైన నాయకత్వం, పారిశ్రామికీకరణకు, వ్యవసాయానికి సమానమైన ఆదరణ, ప్రోత్సాహం లభించడం, ప్రాంతీయ సమస్యలకు సమాధానం రావటం వంటి కారణాలు ఒకవైపు కాగా, ఆర్థిక పురోగతికి దన్నుగా నిలబడిన భారతదేశపు మధ్యతరగతి వర్గం. దేశంలో గల అధికశాతం ప్రజలు ఈ తరగతికి చెందిన వారే కావటం వలన పై వ్యాఖ్యను విశ్వాసంతో చేయవచ్చు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా గత 70 సంవత్సరాలుగా తమకు అప్పగింపబడిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసి, మిగిలిన పనిని తమ ముందరి తరానికి అప్పగిస్తూ సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించింది భారతీయ మధ్యతరగతి.

మధ్యతరగతి ఎంత ముఖ్యం?:

అటు ఎగువ మధ్యతరగతి వారి జీవన శైలిని అందుకోలేక, దిగువ మధ్యతరగతితో పోటీ పడలేక జీవనాన్ని తోస్తూ కొండొకచో లాగుతూ వస్తున్నది మధ్యతరగతి. పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ( People Research on India's Consumer Economy (PRICE)) అనబడే ప్రభుత్వేతర సంస్థ(NGO) నిర్వహించిన సర్వేల ప్రకారం 2004-05లో భారతదేశంలో మధ్యతరగతి వారు 14% గా ఉండేవారు. అదే 2020-21 లో 31% గా పెరిగింది.  వృద్ధి రేటు ఇదేవిధంగా కొనసాగితే, 2030 కి గానూ 44 శాతానికి పెరగవచ్చు. ఈ పెరుగుదల గుణాత్మకమైనది. వ్యాపారకోణంలో చూస్తే ఈ పెరుగుదలను "వినియోగదారీకరణ"(Consumerism) అనొచ్చు. కంపెనీలకు వినియోగదారుల అవసరం ఉంటుంది ఎప్పుడూ. కొనుగోలు శక్తి దేశంలో మెజారిటీగా ఈ వర్గం వద్దనే ఉంటుంది, ఇది చాలా చిన్నదైనా, సంక్లిష్టమైన లెక్క. మళ్ళీ ఇక్కడ వస్తువుల ఉత్పత్తి, పంపిణీ, ప్రచారం, మార్కెటింగ్ వంటి ఇతర వ్యూహాలు ఇమిడి ఉంటాయి.

మధ్యతరగతికి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయం:

ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ప్రస్తుతం లెక్కల ప్రకారం మధ్యతరగతి మనిషిగా లెక్క తేలారు. అదే 2047 నాటికి ఇదే సంఖ్య ప్రతి ముగ్గురిలో ఇద్దరిగా అంచనా వేయబడింది. ఇది నిస్సంశయంగా భవిష్యత్తును నిర్దేశించే సంఖ్య. ఎంత మాత్రమూ అలసత్వం పనికి రాదు. ఐతే వీరికి ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా నిశ్శబ్దంగానే అనుభవిస్తారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా!! ఉదాహరణగా కరోనా కాలాన్ని తీసుకోవచ్చు. కరోనా(Corona) దేశానికే కాక ప్రపంచానికే పెను ముప్పును తెచ్చి పెట్టింది.


జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అప్పటి కష్టాలు దుర్భరమైనవి. ఆ సమయంలో ప్రభుత్వాలు చాలా చక్కగా సమన్వయంతో పని చేసి, ఒక పెద్ద విపత్తు నుండి దేశాన్ని, ప్రజలను కాపాడాయి. ఇక్కడే వచ్చింది చిక్కు. ధనికుల చేతిలో ఉండే సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం(MSME)  అప్పటికప్పుడు స్పందించి తగిన రాయితీలను, ప్రోత్సాహకాలను అందించి ఆదుకున్నది. దిగువ మధ్యతరగతి వారికీ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను, ఇతర సామాగ్రిని అందించి కాపాడింది. మధ్యతరగతికి అందిన సాయం దాదాపుగా శూన్యం. కనీసం EMI  ల విషయంలో నైనా మరింత చక్కని మార్గదర్శకాలు ఇవ్వవలసినదని  విమర్శ ఎదుర్కోవలసి వచ్చింది. మూడు నెలలు కట్టవలసిన అవసరం లేదు ఆ తరువాత వడ్డీతో సహా మొత్తం చెల్లించ వచ్చు అన్న ఆదేశం కొంత విమర్శను ఎదుర్కొన్నది. వర్తమానంలో కూడా మధ్యతరగతి వారికి అధికారికంగా నిర్ణయించిన ఆర్థిక ప్రమాణాలంటూ లేవు. ఒక ఇల్లు కట్టుకోవటం లేదా కొనుక్కోవటం, తమ పిల్లలకు స్కూలు/కాలేజీ ఫీజులను చెల్లించి మంచి విద్యను అందించటం అన్నవి మాత్రమే నిర్దేశిత లక్ష్యాలు. ఇది తరాలుగా గీసుకున్న పరిధి. ఇది చెరుపలేనిది. స్వంత ఇల్లు అన్న కల సాకారం చేసుకోవటానికి ఇప్పటికీ అనేకులు పడరాని పాట్లు పడుతూ ఉంటారు. కనీసం సంవత్సరంలో ఒకసారి అయినా పుణ్యక్షేత్ర దర్శనం అన్నది సాకారం చేసుకోగలరు. అయినా ఇంతకు మించి ఆశ కూడా ఏమీ ఉండదు. స్వంత ఇల్లు, స్వంత కారు, వృద్ధాప్యంలో అవసరమైయ్యే పొదుపు, భీమా ఇవే కాక సంవత్సరానికొకసారి వినోద యాత్ర. అంతే. ప్రశాంతమైన, నాణ్యమైన జీవన విధానం.

నిర్ణాయక శక్తి:

ఏది ఏమైనా 2030 నాటికి దేశ ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, అభివృద్ధి పథకాలను నిర్ధారించే స్థితిలోకి భారతీయ మధ్యతరగతి వర్గం మారబోతున్నది. బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఎదురొడ్డి నిలిచినా కూడా, పారిశ్రామికీకరణ వల్లనూ తమకు అలవాటు లేని కొత్తదైన సామూహిక విద్యావిధానం, జీవన విధానం వల్లనూ ఏర్పడిన మధ్యతరగతి అనబడే వర్గం వచ్చే కొన్ని సంవత్సరాలలో ఒక నిర్ణాయక శక్తిగా మారబోతోంది.

మధ్యతరగతి వారి విలువలు అనే మాట ఎక్కువగా రాజకీయ నాయకుల నోటి వెంట వినటం జరుగుతుంది. నిరంతర కృషి, స్వీయ క్రమశిక్షణ, ఆకాంక్ష, పొదుపు వంటి లక్షణాలను ఈ వర్గీయులు కలిగిఉంటారు. అయితే  ఇవే పద్ధతులను పాటించే దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలను కూడా ఒకే చోట చేర్చి ఈ విలువలను ఆపాదించవచ్చు.

:ముగింపు:

క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని కలిగి ఉన్నా కానీ "క్లర్క్"(Clerk) మాట స్థిరపడి పోయింది. దీనిని తన పైనుండి తొలిగించుకోవటం కష్ట సాధ్యమైన విషయం. తరాల మధ్య అంతరం వేధిస్తున్న సమస్య. నెలసరి రాబడి పెరిగినా పెరుగకున్నా, పిల్లల చదువులు, తమ ఆరోగ్యరక్షణకు పొదుపు, గృహ నిర్మాణం ఇతర ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవటం అన్నది అతి పెద్ద సవాలు గా మారింది.,