మధ్యతరగతి ఆర్థిక ప్రణాళిక మరియు దాని ప్రాముఖ్యత. (Madhya taragati Arthika pranalika. Dani pramukhyata)(Importance of financial planning in Telugu):

ప్రారంభం: 

మెజారిటీ మధ్య తరగతి ప్రజలు తమ ఖర్చులను, రాబడిని, మదుపును  లెక్కలు వేసుకోరు. దీని వలన వారు ఎదుర్కొనే కష్టం నెలాఖరుకు వస్తుంది. రాబడికి, ఖర్చుకు మధ్య అగాధం లాగా తేడా రావటంతో. ఇది ఒక నెల జరిగిపొతే పరవాలేదు. కానీ బడ్జెట్(Family budget) వేసుకోక పోవటం వల్ల చక్కటి తెలుగులో చెప్పాలంటే, నెలవారీ  లెక్కలు రాసుకోక పోవటం వల్ల ఈ తలనొప్పి, ప్రతి నెలా అనుభవించవలసి వస్తుంది. మరి దీనికి మార్గాంతరం ఏమిటి?

నెల పద్ధు తప్పనిసరి:

ఖర్చులు రాయటం వల్ల నెలాఖరుకు మన వద్ద ఎంత మిగులుతోంది అన్నది మనకు నికరంగా తెలుస్తుంది కాబట్టి, మన జేబులోంచి అవుట్ ఫ్లో అన్నది నియంత్రించవచ్చు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ప్రకారం"మన ఖర్చుల తరువాత మిగిలినది దాచుదాం అన్నట్టు కాక దాయగా మిగిలినది ఖర్చుకు” అన్న సూత్రం అలవాటు చేసుకోవాలి. పైసా పైసా ఖర్చు రాయకపోతే, మన ఇంట్లో పాడయిన మిక్సీ ఎప్పుడు బాగుచేయించాలో, నెల మధ్యలో అనుకోకుండా అయిపోయిన ఏ కందిపప్పో కొనుక్కొని రావాలి అన్నది కూడా మన చేతిలో ఉండదు.

కిటుకు:

నెలవారీ ఖర్చులు రాసుకోవటం ఎంతగానో ముఖ్యం. ఇది ఒకరకంగా కుటుంబానికి ఒక ఇరుసు లాంటిది. ఏఏ ఏరియాలలో మన ఖర్చుకు కళ్లెం వేయాలి, ఎక్కడ మరింత పెట్టవచ్చు అన్నది తేలి పోయేది ఇక్కడే. వీలైనంత వరకూ క్రెడిట్ కార్డును ఉపయోగించవద్దు. ఇది అత్యంత ఆవశ్యకమైన సమయాలలోనే అన్న విషయం గుర్తెరిగి ఉండాలి. నిజానికి క్రెడిట్ కార్డు ను ఉపయోగించడం కూడా ఒక కళ. దానిని మళ్ళీ చర్చిద్దాం.



ఖర్చును నియంత్రించడానికి ప్రాథమికంగా సూత్రలంటూ ఏమీ లేవు. మెళకువలు మాత్రమే. రెండు లేదా అంతకన్నా ఎక్కువ కుటుంబాలు కలిసి, ఒకేసారి ఇంటికి సరిపడా వస్తువులను తెచ్చుకోవాలి. దీనికి మన నగరంలో, పట్టణంలో ఉన్న హోల్సేల్ మార్కెట్ ను ఆశ్రయించాలి. సరకులు పెద్ద మొత్తంలో తీసుకోవటం వల్ల నెలకు, మూడు నెలలకు లేదా సంవత్సరానికి సరిపడా ఒకేసారి తీసుకోవటం వల్ల దాదాపు 10 నుండి 50 శాతం వరకూ డబ్బు ఆదా అవుతుంది.

జీరో బాలన్స్ బ్యాంక్ అకౌంట్:

బ్యాంక్ ఎకౌంట్ దాదాపు అందరూ కలిగి ఉంటారు. అది జీరో బ్యాలన్స్ అయి ఉంటే మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ఇప్పుడు చాల బ్యాంకులు సమకూరుస్తున్నాయి. కోటక్ 811, ఇండస్ ఇండ్, డిజిటల్ బ్యాంకింగ్ సిస్టం ఐన నియో బ్యాంకు(Neo bank), ఈక్విటాస్ బ్యాంకు(Equitas Bank) ఇంకా ఎన్నో.  

వీటిల్లో ఎకౌంట్ ఓపెన్ చేయటానికి బ్రాంచ్ వెళ్ళవలసిన అవసరం లేదు. చక్కగా ఇంటి వద్ద నుండే ఆన్ లైన్ లో కానించేయవచ్చు."ఈ బ్యాంక్స్ ఇతర సాంప్రదాయ బ్యాంకులకన్నా ఎక్కువ సేవింగ్స్ వడ్డీ ని ఇస్తాయి."  వీటిల్లో మన సంపాదనను దాస్తే ఖర్చుల విషయంగా కొంత ఆలోచించుకొని ఆదా వైపు మన దృష్టి వెళుతుంది. EMI లకు ఎంత వెళుతోంది అన్నది వేరే లెక్కగ వేసుకోవాలి. దీని వల్ల మనం ppf  వంటి గవర్నమెంట్ స్కీం లలోనూ, ఇన్సూరెన్స్ లకు గానూ ఎంత టాక్స్ బెనిఫిట్ ‘80c’ ప్రకారం పొందుతున్నాం అన్నది స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంటుంది.

నిపుణుల సూత్రాలు, సూచనలు:

50, 30, 20 సూత్రాన్ని పాటించాలి. మన రాబడిలో 50% మన నెలవారీ ఖర్చులకు, నెలవారీ బాధ్యతలను పూర్తి చేయటానికి ఉపయోగించాలి. 30% మన చెల్లింపులు, చిట్టీలు, రుణాలను తీర్చటం వంటి వాటికీ ఖర్చు చేయాలి. మిగిలిన 20% మన సుఖాలకు ఖర్చు చేయవచ్చు. ఇది ఎన్నో కుటుంబాలను గమనించి వేసిన పట్టిక. ఇదే విధంగా చేయాలనీ ఏమీ లేదు. దీనికి మరి కొన్ని మార్పులు చేర్పులు చేసి వినియోగించుకోవచ్చు.


ఇంటికి తీసుకునే వస్తువుల కొరకు గుంజాటన అస్సలు వద్దు. ఉదాహరణకు ఏ టీవీయో లేక ఫ్రిడ్జ్ లాంటివి తీసుకుందామని అనుకున్నప్పుడు, ఖర్చుకు వెనుకాడకుండా ప్రీమియం బ్రాండ్ తీసుకోవటం అన్నివిధాలా మంచి పధ్ధతి. ఎందుకంటే వీటిపై మళ్ళీ మళ్ళీ పెట్టుబడి  పెట్టలేము. తరచూ రిపేర్లు వచ్చినా ఇబ్బందే.

అందుబాటులో ఉన్నదని ఆన్లైన్ షాపింగ్ చేయవద్దు. ఇక్కడ ఆఫర్స్ చాలా ఊరించే విధంగా ఉంటాయి. తప్పక తీసుకోవాలని ఆశ పుడుతుంది. ఇదే వారి మార్కెటింగ్ స్ట్రాటజీ. ఐతే ఒక వస్తువు అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పక వారు ఇచ్చే ఆఫర్స్ ని వినియోగించుకోవాలి.

డబ్బును సంపాదించి పెట్టె మార్గాంతరాలను ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉండాలి. రెండవ ఉద్యోగం చేయటం వల్ల ఎప్పటికీ లాభమే. మన నైపుణ్యాలకు దగ్గరగా ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఎప్పుడూ ముందుండాలి.

ఆరోగ్య సంరక్షణ కొరకు వీలైనంత వరకు పెట్టుబడి పెట్టాలి. ఇది ఏనాటికైనా మీకు, మీ కుటుంబానికి అవసరమైయ్యే విభాగం. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ ఇన్సూరెన్స్ రోజులు. కుటుంబానికి అవసరమయ్యే రీతిలో ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. భవిష్యత్తు కోసం నిధి ఏర్పరచి పెట్టుకోవటం ఎప్పటికీ మంచిదే కదా!!

ముగింపు:

జీవించడం ఒక కళ. మనని, మన కుటుంబాన్ని ఎంత చక్కగా తీర్చి దిద్దుకుంటే అంత సంతోషంగా ఉండగలం. అందంగా జీవించడానికి డబ్బు ఒక మాధ్యమం మాత్రమే. ఐతే మిగిలిన అన్ని మాధ్యమాలని ఈ డబ్బు మాత్రమే ఆధిపత్యం చేయటం వల్ల దీని గురించి ఇంతగా చర్చించుకోవలసి వస్తోంది. సంపాదించడం, ఖర్చు చేయటం, ఆదా చేయటం అన్నీ మీ చేతిలో మాత్రమే ఉన్నాయి. మెలకువగా అలోచించి, కొత్త మార్గాలను అన్వేషించి డబ్బుతో వ్యవహరిస్తే చాలు.