గత 15(2005-2021) ఏళ్లలో భారతదేశంలో పేదల సంఖ్య దాదాపు 415 మిలియన్లకు పడిపోయిందని గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. పేదరికాన్ని గణనీయంగా తగ్గించిన అనేక దేశాలలో భారతదేశం ఒకటి, నివేదిక ప్రకారం, జనాభా మరియు ఆరోగ్య సర్వే నుండి దేశంలోని 71 శాతం డేటా మహమ్మారికి ముందు 2019లోనూ, మిగిలినది 2021లోనూ తీసుకొని తయారుచేయబడింది. పేద రాష్ట్రాలు, పేదరికాన్ని వేగంగా తగ్గించాయి. అన్ని సూచికలలో కూడా దారిద్ర్యం అన్నది పేద ప్రజలలో గణనీయంగా పడిపోయింది. పిల్లల్లో పేదరికం వేగంగా తగ్గుతున్నదని నివేదిక సూచించింది. ఏది ఏమైనప్పటికీ, భారతదేశం మొత్తంలోనూ పేద పిల్లలు 97 మిలియన్లు లేదా 0 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పిల్లల జనాభాలో 21.8 శాతం మంది ఉన్నారు. 1995 మరియు 2021 మధ్య గల గణాంకాలను గమనిస్తే, సాలీనా 6.3 శాతం చొప్పున భారతీయ జనాభాలో మధ్యతరగతి వృద్ధి చెందుతోంది. అత్యంత వేగమైన పెరుగుదలగానే లెక్కించవచ్చు. 2030 నాటికి, ఈ సమూహం యొక్క పరిమాణం యునైటెడ్ స్టేట్స్(USA), ఐరోపా(Europe) కంటే పెద్దదిగా అంచనా వేయబడింది. నిజానికి మధ్యతరగతి సమాజం వైపు ఇప్పటికే భారీ మార్పు జరిగిపోయింది. 2030 నాటికి భారతీయ జనాభాలో దాదాపు 47% మంది మధ్యతరగతి శ్రేణిలో చేరతారని అంచనా. భవిష్యత్ వృద్ధి అనేది పెరుగుతున్న మధ్యతరగతిపై ఆధారపడి ఉంటుందని, మధ్యతరగతి పరిణామం దేశాభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. 2005-06లో 51.3% గా ఉన్న పేదరికపు తీవ్రత 2015-16లో 44%కి తగ్గింది. అదే 2019-21లో 42%కి తగ్గింది.

ఎందువల్ల పేదరికం తగ్గుతోంది?
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అధికశాతం ప్రజలు వ్యవసాయం పైన, వ్యవసాయ ఉత్పత్తుల పైన ఆధార పది జీవిస్తారు. ఇందులో పాలు, పప్పులు, జనపనార ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాకుండా బియ్యం, గోధుమలు, చెరకు, వేరుశెనగ, కూరగాయలు, పండ్లు మరియు పత్తి ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. వ్యవసాయాధారిత దేశం కాబట్టి గణాంకాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉన్నాయి. వ్యవసాయం పై ఆధారపడి జీవనాన్ని కొనసాగించేవారు ముందు తరం నుండి నైపుణ్యాన్ని పొందుతారు. ఒక రకంగా తరాలుగా ఇది కొనసాగుతూ వస్తున్నది.
ఇటీవలి కాలంలో వ్యవసాయేతర రాబడి పెరిగి నైపుణ్యం లేని రంగాలలో కూడా రాబడి మార్గాలను అందుకోగలుగుతున్నారు. ప్రతిరోజూ గమనించే ఒక ఉదాహరణను ఇక్కడ ప్రతిగా తీసుకోవచ్చు. యువత, మధ్యవయస్కులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా చేయగలుగుతున్న పని ఇది. చేతిలో ఒక ద్విచక్ర వాహనం ఉంటే చాలు. ఉద్యోగం ఉన్నట్లే. ప్రతిరోజూ వండిన ఆహార పదార్థాలను మన వరకూ చేరవేసే స్వీగ్గీ(Swiggy), జొమాటో(Zomato) డెలివరీ బాయ్స్, కావచ్చు, ఈ కామర్స్ సంస్థల నుండి వస్తువులను ఇంటికి చేరవేసే వారు కావచ్చు, ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళే సమయం తగ్గించేందుకు ప్రతి ఒక్కరికీ పనికి వచ్చే రవాణా సౌకర్యం అందించే ఓలా, ఊబర్, రాపిడోలు కావచ్చు, కొరియర్ సర్వీసెస్ అందించేవారు కావచ్చు, ఉత్పత్తి దారుల నుండి, ఉత్పత్తిదారులకు వస్తుసామగ్రి అందించే వారు కావచ్చు ఈ రకంగా చాలా విభాగాలు ఏర్పడ్డాయి. ఈ పనుల ద్వారా కోట్లాది మండి ఉపాధి పొందుతున్నారు. వెచ్చించే సమయాన్ని బట్టి 20 వేల నుండి 60 వేల వరకూ వీరి నెలసరి ఆదాయం ఉంటున్నది. నగరాలు, పట్టణాలలోనే కాక ఈ సేవలు ప్రస్తుతం చిన్న చిన్న గ్రామాలకు కూడా వ్యాపించాయి. ఉపాధి అవకాశాలు ఎంతగానో మెరుగుపడ్డాయి. యువతకు ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. కుటుంబానికి ఆసరాగా నిలబడే అవకాశాన్ని కలిగిస్తోంది. ఉన్నచోటనే ఉపాధి లభించడం అన్నది ఎంతో ఊరటనిచ్చే విషయం. మరొక విషయం ఇక్కడ ప్రస్తావన చేయాలి! చేతిలో ద్విచక్ర వాహనం లేని వారు కూడా పైన పేర్కొన్న సేవలను అందించి ఉపాధి పొందవచ్చు. ఎలాగంటారా! చాలా తేలిక. ఒకవేళ మీ వద్ద అదనంగా టూవీలర్ ఉన్నదనుకోండి. దాన్ని అద్దెకీయడమే. దీని వలన మీకూ ఆదాయము, మరొకరికీ ఆదాయము. పైన పేర్కొన్న వనరు ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి అవకాశాలు, మార్గాలు కోకొల్లలుగా ఏర్పడినాయి. దీనివల్ల పేదరికంలో ఉన్న కుటుంబాలు క్రమంగా మధ్యతరగతికి మారినాయి.
మహిళలకు అవకాశాలు:
ఇక్కడొక విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మహిళలు చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా ఆహ్వానించదగినది. వీరికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు(NGO) ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నాయి. ఆర్థిక స్వాతంత్ర్యం(Financial freedom) సాధించడమే కాక కుటుంబానికి ఆసరాగా నిలబడగలుగుతున్నారు. ఈ పరిణామాలన్నీ మొదలయ్యి/ఊపందుకుని కేవలం 7 లేదా 8 సంవత్సరాలే అవుతున్నది. అయితే పేదరికం గణాంకాలు వివాదాస్పదంగా ఉన్నాయి. వారి చుట్టూ ఏకాభిప్రాయాన్ని రూపొందించడం చాలా కష్టం. పేదరికం నిష్పత్తి గణనీయంగా మారుతూ ఉంటుంది. :
కారణాలు:
415 మిలియన్ల భారతీయులు పేదరికం నుండి బయటపడటం బహుశా భారతీయ ఆర్థిక వృద్ధి రేటు యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి. ఈ పనితీరుకు కారణం ఏమిటి? ప్రశ్న చాలా చిన్నది. అయితే మొట్టమొదటి కారణంగా స్థిరమైన ప్రభుత్వాన్ని పేర్కొనవచ్చు. ప్రభుత్వ విధానాలను పేర్కొనవచ్చు. తీసుకుని వచ్చిన సంస్కరణలు కొత్త కొత్త వ్యాపారాలకు తలుపులు తెరిచినై. విదేశీ పెట్టుబడులు(FDI) వచ్చి చేరినై. నైపుణ్యం కల కార్మీకులకు మెరుగైన ఉద్యోగావకాశాలు మెరుగుపడినై.
ముగింపు:
చక్కని పనితీరు వలన ఉత్పాదకతలో నాణ్యతా ప్రమాణాలు పెరిగి, మరిన్ని పెట్టుబడులు ఆకర్షింపబడ్డాయి. ఈ కారణం చేతనే దేశంలో నైపుణ్యం కల్గిన కార్మికులతో సమానంగా నైపుణ్యం అవసరం లేని రంగాలలో కూడా ఉద్యోగావకాశాలు సృష్టింపబడ్డాయి. అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకునే భారతీయ యువత బీదరికాన్ని వీడి, మధ్యతరగతి బాట పట్టి దేశాభివృద్ధికి తమవంతు సాయం అందిస్తున్నది.