ఇక విదేశీయులు భారతదేశపు చదువులు చదువుతారా?(IIT goes global):

పరిచయం:

టాంజానియాలోని, జాంజిబార్‌లో IIT మద్రాస్ క్యాంపస్‌ను నెలకొల్పేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది, అక్టోబర్ 2023లో తన కార్యక్రమాలను ప్రారంభించే యోచనలో ఉంది. టాంజానియాలోని, జాంజిబార్‌లో మొట్టమొదటి


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలకొల్పబడుతోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. రెండు దేశాల మధ్య విద్యాసంబంధమైన సహకారం బలోపేతం ఔతుందని MEA తెలిపింది. అంతేకాకుండా యుకె, యుఎఇ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, మలేషియా మరియు ఖతార్‌లలో ఐఐటి క్యాంపస్‌లు త్వరలో రానున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ (IIT-D) అబుదాబిలో IIT ఢిల్లీ క్యాంపస్ స్థాపన కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఏ విధంగా చూసినా సరే, ఐఐటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది

ఐఐటీ గో గ్లోబల్అన్న నినాదంతో భారత్ ముందుకు పోతోంది.ప్రచారంలో కొత్త ఎంఓయూ అదనం. IIT మద్రాస్ జాంజిబార్ తర్వాత ఇది రెండవ అంతర్జాతీయ IIT క్యాంపస్.

ఆఫ్‌షోర్ లో IIT పేరు:
వార్తా సంస్థ PTI ప్రకారం, ఆఫ్‌షోర్ IITల పేరు 'ఇండియన్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'. గందరగోళాన్ని నివారించేందుకు 'అంతర్జాతీయ' అనే బిట్‌ను పేరులో చేర్చనున్నట్లు స్పష్టం చేశారు. 
 "తగినంత సారూప్యతతో పేరులో వ్యత్యాసం, కొత్తగా స్థాపించబడిన IITలు తమ స్వంత గుర్తింపు, నైతికతని అభివృద్ధి చేసుకోవడానికి స్వేచ్ఛను ఇస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న IITల బలాన్ని పెంచుతుంది. ఆఫ్‌షోర్ క్యాంపస్ తన మాతృ సంస్థ ఐన భారతీయ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మార్గదర్శకత్వం పొందే
ఒక విశిష్ట చట్టపరమైన సంస్థగా ఉండాలి.
 ఆఫ్‌షోర్ IIT కోసం దేశాల ఎంపిక:
నివేదికల ప్రకారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఈజిప్ట్ మరియు సౌదీ అరేబియా దేశాలు ఆఫ్‌షోర్ IIT క్యాంపస్‌లను హోస్ట్ చేయడానికి ఆసక్తిని కనబరిచాయి. IIT ఢిల్లీ UAEలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తుండగా, IIT మద్రాస్ శ్రీలంక, నేపాల్, టాంజానియాలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆఫ్‌షోర్ ఐఐటీపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ:

ఆఫ్‌షోర్ ఐఐటి క్యాంపస్‌ల కోసం సాగుతున్న ప్రణాళికపై చర్చించడానికి ఐఐటి కౌన్సిల్ స్టాండింగ్ చైర్‌పర్సన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 17 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌ గోవిందన్‌ రంగరాజన్‌తో పాటు భారత్‌కు చెందిన వివిధ ఐఐటిల డైరెక్టర్లు కూడా ఉన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) లేదా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఇఆర్)ల నిర్మాణాన్ని ప్రమాణంగా తీసుకుని ఆఫ్‌షోర్ ఐఐటిని రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. అంటే భారత్ లో ఉన్న ఐఐటిల మాదిరిగానే దేశం వెలుపల కూడా ఐఐటిని నిర్మించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇన్‌స్టిట్యూట్‌ల శ్రేణిని, స్థాయిని మార్చి స్థాపించవచ్చు.
 
ఆఫ్‌షోర్ IITలో విద్యాభ్యాసం:
కమిటీ సిఫార్సు ప్రకారం, అన్ని ఆఫ్‌షోర్ క్యాంపస్‌లలో ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా ఉంటుంది. విదేశాల్లోని క్యాంపస్‌లు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తాయని, సెమిస్టర్‌ ప్రారంభ, ముగింపు తేదీలను అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా ట్యూన్ చేయవచ్చని కమిటీ నిర్ణయించింది. సంస్థలు తమ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ డిగ్రీ (BTech), మాస్టర్స్ డిగ్రీ (MTech), పరిశోధన ఆధారిత PhDని అందిస్తాయి.భారత్ లో మాదిరిగా ఐఐటీ సంయుక్త ప్రవేశ పరీక్షలను నిర్వహించలేక పోవచ్చు దానికి కావలసిన సలహాలను, సూచనలను కమిటీ సేకరిస్తోంది. అదేవిధంగా మరికొన్ని సబ్జెక్టులలో స్పెషలైజేషన్ కార్యక్రమాలను కూడా కమిటీ సిఫార్సు చేసింది. 
 
-కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
 
- డేటా సైన్స్
 
-కృత్రిమ మేధస్సు
 
-మెషీన్ లర్నింగ్
 
- రోబోటిక్స్
 
- ఎలక్ట్రానిక్స్
 
-మైనింగ్ లేదా పెట్రోలియం అండ్ ఎనర్జీ
 ఆఫ్‌షోర్ IITలో విద్యార్థి బలం:
"ఇచ్చిన ప్రోగ్రామ్‌ల వలన విద్యార్థులకు కోర్సు ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌లు స్థానిక విద్యార్థుల జనాభాకు అనుగుణంగా ఉండాలి, ఇందులో భారతీయ డయాస్పోరాను కలిపి చూడబడుతోంది. అయితే ఈ విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థుల శాతం 20 కంటే తక్కువగా ఉండాలని ప్యానెల్ సిఫారసు చేసింది"
అని పిటిఐ పేర్కొంది.
 కమిటీ సిఫార్సు ప్రకారం ప్రతి B.Tech ప్రోగ్రామ్‌కు సంవత్సరానికి 30 నుండి 40 మంది విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు 15 నుండి 20 మంది విద్యార్థులు, PhD ప్రోగ్రామ్‌కు కొద్దిమంది విద్యార్థులుగా కమిటీ పేర్కొంది.
దేశంలోని ఐఐటీల కంటే ఓవర్సీస్ ఐఐటీ క్యాంపస్‌లకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని, అధ్యాపకుల నియామకానికి, జీవితకాల ఉద్యోగ ఒప్పందాల పై ప్రభుత్వ సర్వీస్ షరతుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కమిటీ సూచించింది.
 విదేశాల్లోని ఐఐటీ క్యాంపస్‌ల నిర్వహణపై కూడా కమిటీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది, విదేశంలోని
క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను హోస్ట్ ప్రభుత్వం చేయాలని పేర్కొంది.
 ఇన్‌స్టిట్యూట్‌లను స్థాపించేటప్పుడు స్థానిక ప్రభుత్వం యొక్క నిబద్ధత కొత్తగా ఏర్పడబోతున్న క్యాంపస్ కోసం మరింత అవసరం. విదేశాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయటమే కాకుండా, వాణిజ్యం కోసం ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి, ఈ ఇన్‌స్టిట్యూట్‌లు స్థానిక విద్యార్థులకు (అది భారతీయ డయాస్పోరా అయినా కావచ్చు) సేవలను అందించాలిఅని కమిటీ నివేదిక పేర్కొంది.
 
విదేశీ క్యాంపస్‌లలో భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టంగా20% కంటే ఎక్కువ ఉండకూడదని సిఫార్సు చేసింది.
ఆయా దేశ స్థానిక చట్టాల ద్వారా తప్ప విద్యార్థులకు లేదా ఉద్యోగులకు రిజర్వేషన్లు లేదా రాయతీలు
ఉండవని కమిటీ సూచించింది. ఇది భారతదేశంలో ఉన్న, భారత రాజ్యాంగం ప్రకారం అవసరమైన దిగువ కులాల రిజర్వేషన్‌ల వలె కాకుండా ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఆతిథ్య దేశం యొక్క చట్టాలు, నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.
 అయితే, దేశీయ ఐఐటీలకు ఈ ప్రాజెక్ట్ ఆర్థిక భారంగా మారకుండా ఉండేందుకు ఆతిథ్య దేశ ప్రభుత్వం
 ఉదారంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది.
ముగింపు:
 ఐఐటి క్యాంపస్ ప్రపంచ స్థాయి విద్య, పరిశోధనా సంస్థగా రూపుదిద్దుకోవాలి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలను పెంపొందించడానికి, దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడానికి మద్దతునిచ్చే విధంగా ఉండాలి. ఆతిథ్య దేశంలో పరిశోధన, కొత్త ఆవిష్కరణలను రూపొందించే విస్తృత లక్ష్యంతో ఉండాలి. భారతీ విద్యావిష్కరణల యొక్క ఆకాంక్షను, భారతీయ విద్య యొక్క నాణ్యతను ప్రపంచానికి ఒక ఉదాహరణగా ఒక ఉదాహరణగా చూపించాలి.