ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి. (IMF ఈ సంవత్సరం భారతదేశానికి 6.8% వృద్ధిని అంచనా వేసింది, యునైటెడ్ స్టేట్స్ కి ఇవ్వబడిన వృద్ధి అంచనా కేవలం 1.6%. 2030 నాటికి, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంచనా .వేయబడింది, అయితే US మరియు చైనా తర్వాత మాత్రమే. ఏటా లక్షలాది మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడుతున్నారు. సాధారణంగా, మహిళలు పని చేస్తే, ఏ ఆర్థిక వ్యవస్థకైనా అది ఒక వరమే. చాలా దేశాలు తమ శ్రామిక శక్తిలో మహిళలను భాగం చేసుకుని వేగంగా అభివృద్ధి చెందాయి. భారతదేశానికి సంబంధించినంత వరకూ కూడా ఇదే నిజం.
సమస్య ఏమిటి?
1990 దశకం అంతా, ఇంకా 2000ల దశకం ప్రారంభంలో బలమైన GDP వృద్ధి, స్త్రీ కార్మిక భాగస్వామ్యం చాలా తక్కువ స్థాయిలో ఉండేది. సమస్య ఏమిటంటే, ఇప్పటికీ ఆశించిన స్థాయిలో మహిళల భగస్వామ్యం లేదు. 2021 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం, ప్రతి 5 మంది భారతీయ మహిళల్లో ఒకరి కంటే తక్కువ మాత్రమే పని చేస్తున్నారు. అధికారికంగా. ఇందుకు కారణం భారతదేశంలో వ్యవసాయం లేదా ఇంటి పని తరచుగా లెక్కించబడదు. ఇది 2021 తాలిబాన్ స్వాధీనానికి ముందు పాకిస్తాన్ మహిళా కార్మిక రేటు కంటే తక్కువ. పాకిస్తాన్ మర రెండూ కూడ కఠినమైన సామాజిక నిబంధనలు మహిళలు తక్కువ చలనశీలతను కలిగి ఉంటారు. సాంప్రదాయ పితృస్వామ్య నిబంధనలు స్త్రీలను ఇంటికి లేదా కార్యాలయంలో అయితే ద్వితీయ,తృతీయ స్థాయికి తగ్గించాయి. దీని వలన మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, విద్య మరియు రాజకీయ ప్రమేయము తీవ్రంగా ప్రభావితం చేయబడ్డాయి. స్త్రీలకు సాధారణ సమస్య ఏమిటంటే పుట్టినప్పటి నుండి మరణం వరకు కొనసాగే లింగ వివక్ష. నిరక్షరాస్యత. సరైన విద్య లేకపోవడం, ఇంటి పనుల బాధ్యత, అత్యాచారం, కార్యాలయంలో లైంగిక వేధింపులు మొదలైనవి భారతదేశంలోని మహిళకు సమస్యలు. భారతదేశపు శ్రామికశక్తిలో మహిళల నిష్పత్తి తక్కువగా ఉండటమే కాదు. తగ్గుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా, భారతదేశ మహిళా కార్మిక భాగస్వామ్య రేటు స్థిరమైన అధోముఖ రేఖలా కనిపిస్తోంది: 2005లో 32% గా ఉండగా 2021లో 19%కి పడిపోయింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఈ దశలో మహిళలు దాని శ్రామిక శక్తి నుండి తప్పుకుంటున్నారు. అదీ రికార్డు సంఖ్యలో. ఇందులో ధనిక, పేద, పట్టణ, గ్రామీణ, సామాజిక తరగతి, మతం, వయో పరిమితి అన్న తేడా లేకుండా అన్నీ వర్గాలలోనూ జరుగుతోంది. భారతదేశంలోమహిళా కార్మికులపై 2014లో ప్రాథమిక అధ్యయనం మొదలు పెట్టి, దాని క్షీణతను ట్రాక్ చేస్తూనే ఉన్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌లోని ఆర్థికవేత్త షెర్ వెరిక్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. "ఇది నాకు ఒక పజిల్లా ఉంది. ముఖ్యంగా బలమైన ఆర్థిక వృద్ధి జరుగుతున్న కాలంలో భారతీయ కార్మిక మార్కెట్లో మహిళా శక్తి తగ్గటం అన్నది ఎలా జరుగుతోంది?" ఆర్థికవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించడానికి సహాయపడే ఆరు అంశాలను ఉదహరించారు: శ్రేయస్సు, విద్య, సామాజిక నిబంధనలు, భద్రతా సమస్యలు, గణాంక కొలతతో సమస్యలు మరియు మంచి మరియు ఉత్పాదక ఉపాధి లేకపోవడం.
1. శ్రేయస్సు:
గృహ ఆదాయం పెరిగేకొద్దీ, మహిళలు స్వచ్ఛందంగా శ్రామిక శక్తి వితరణ నుండి తప్పుకుంటున్నారు. తమ ఆర్థిక స్థితి బాగుపడ్డది, ఇక విశ్రాంతి తీసుకుందాం అనే ఆలోచనను ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. వ్యవసాయం, ఇతర చేతిపనులలో వెన్ను విరిగేంత పని చేయవలసిన అవసరం ఇకపై లేదు అన్న ఆలోచన బలవంతపు రిటైర్మెంట్ తీసుకునేట్లు చేస్తుంది. "వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు, మహిళలు పని నుండి వెనక్కి తగ్గుతారు. దీనికి కారణం స్త్రీల పని ఒక స్టాండ్‌బై లేదా అత్యవసర చర్యగా పరిగణించబడుతుంది" అని ముంబైలో ఉన్న పాపులేషన్ ఫస్ట్ యొక్క సామాజిక శాస్త్రవేత్త, జనాభా శాస్త్రజ్ఞురాలు మరియు డైరెక్టర్ A.L. శారద చెప్పారు. "కుటుంబం ఆర్థికంగా స్థిరంగా మారిన క్షణంలో, స్త్రీ పని ఒత్తిడి నుండి బయటపడాలని ఆశిస్తారు.
విద్య:
నేటి మహిళలు గతంలో కంటే ఎక్కువ అక్షరాస్యులు మరియు విద్యావంతులు. వారు పాఠశాలలు మరియు కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నారు. అంతేకాకుండా మునుపటి తరాల కంటే కూడా ఎక్కువ కాలాన్ని విద్యాసంస్థలలో గడుపుతున్నారు. అయితే ఈ సంఖ్య ఉద్యోగాల విషయం వచ్చేటప్పటికీ కనిపించడం లేదు. పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో గడిపిన సమయం పని దినాలుగా పరిగణించలేం కదా! ఈ వాస్తవాన్నికూడా ఒక సానుకూల అంశంగా చూడవచ్చు. ఎట్లాగంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడుతోంది.
3. సామాజిక నిబంధనలు:
దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చాలా మంది భారతీయులు ఇప్పటికీ కుటుంబంలో స్త్రీ పాత్ర గురించి సంప్రదాయవాద ఆలోచనలను కలిగి ఉన్నారు. "ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలకు కుటుంబమే మొదటి ప్రాధాన్యత. ముఖ్యంగా భారత్ వంటి దేశంలో స్త్రీ చాలా సాంప్రదాయవాదంలో చిక్కుకొని ఉంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలలో బాధ్యతలు నిర్వహించడం, కుటుంబం కొరకు త్యాగం చేయడం, కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం మరియు పోషించే తల్లులుగా మాత్రమే స్త్రీ కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఇష్టం చూపుతున్నారు. ఒక మహిళ తనను తాను ఒక పోటీదారుగా లేదా ఆకాంక్షలతో కూడిన సాధకురాలిగా అంచనా వేసుకోవటం లేదు.
4. భద్రత:
భారతదేశం యొక్క గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు భారీ భారీ సంఖ్యలో వలసలు మహిళలకు భద్రతాపరమైన సంకోచాలకు గురి చేస్తుంది. తరచుగా మగ కార్మికుడు ఒంటరిగా మొదట వలసపోతాడు, స్త్రీలను, పిల్లలను వారి గ్రామంలో వదిలివేస్తారు. ఇక్కడ భార్య ప్రభావవంతంగా సింగిల్ పేరెంట్ అవుతుంది. ఈ ఒత్తిడుల వలన ఇంటి వెలుపల జీతంతో కూడిన పనిని వెతుక్కోవటానికి ఆమెకు వీలు పడదు. మహిళలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, వారికి తరచుగా భద్రతా సమస్యలు ఉంటాయి. వారి గ్రామాలలో తెలిసినంతగా వారి ఇరుగుపొరుగు గురించి తెలియదు. కొత్త ప్రదేశాలలో బిడియం వంటి స్త్రీ సహజ లక్షణాలు త్వరగా కొత్త వాతావరణంలో కలువనీయవు. ఉద్యోగాలు లభించినా వారు దూర ప్రయాణాలు, రాత్రిపూట పని గంటలు, ప్రజా రవాణా వ్యవస్థలలో తరచుగా ఇబ్బందులు ఎదురౌతాయి. 2012లో, న్యూఢిల్లీ బస్సులో మెడికల్ ట్రైనీపై జరిగిన ఘోరమైన సామూహిక అత్యాచారం భారతీయులను భయభ్రాంతులకు గురిచేసింది. తరువాత. అయితే ఇది మహిళలకు రక్షణ కల్పించాలనే ఆలోచనకు బలం చేకూర్చి, కొత్త చట్టాలను తీసుకొని రావటానికి, మహిళా రక్షణ కొరకు కొత్త ఆవిష్కరణలు చేయటానికి ఆస్కారం కల్పించింది.
5. గణాంక కొలతతో సమస్యలు:
గణాంకాలు భారతదేశంలో మహిళా కార్మిక రేటు 20% గా చూపిస్తూఉన్నట్లయితే మిగిలిన 80% మంది మహిళలు పని చేయడం లేదని అర్థం కాదు. మహిళలు జీతం లేని పని చేస్తారు. గుర్తింపు లేని పనిని చేస్తారు. ఇంటిని నడపడం, పిల్లలను పెంచటం, పొలంలో నాటడం, కోయడం లాంటివే కాక ఇంధన, కట్టెల సేకరణ వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. వీరు ఆదాయాన్ని సమకూర్చలేకపోవచ్చు, ఆదాయం లేకపోవడాన్ని భర్తీ చేస్తున్నారు.
6.ఉత్పాదక ఉపాధి లేకపోవడం:
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మెజారిటీ మహిళలు పట్టణాలలో ఇతరుల ఇళ్లలో క్లీనర్లుగా, వంట చేసేవారుగా పనిచేస్తున్నారు. ఇది చెదురుమదురు పని మాత్రమే కాక అసురక్షిత పని. ఎవరికీ సరైన వేతనాలు లేదా వేతనంతో కూడిన సెలవులు లభించవు. ఇతరుల ఇళ్ళలో పనిచేయటమే కాక స్వంత ఇళ్ళు కూడా సరిపెట్టుకోవాలి. ఇతరుల ఇళ్లలో పని చేసి ఆ తరువాత స్వంత ఇంటిలో కూడా పని చేయడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. పిల్లల సంరక్షణ మరియు గృహ నిర్వహణ అన్నవి వీరికి అప్పగింపబడే ఉద్యోగాలు. ఇవి ఎటువంటి ప్రత్యేకమైన స్కిల్స్ ప్రదర్శించాల్సిన అవసరం లేని ఉద్యోగాలు. వీరిని ఉద్యోగిగా నియమించుకున్న వ్యక్తి వచ్చేవరకూ వీరి ఉద్యోగం కొనసాగుతుంది. ఓవర్‌టైమ్ వర్క్ అవర్స్ అన్నది ఉండదు. శలవులు తీసుకోవటం లేదా కాసేపు విరామం పొందటం ఉండవు. 24 గంటలూ పనిలో ఉండవలసిందే. ఇంత అలసిపోతూ కూడా ఉద్యోగం చేయడం అదృష్టంగా భావించాల్సిందే. బలహీనమైన కార్మిక చట్టాలు సహాయం చేయవు. భారతదేశంలో జాతీయ కనీస వేతనం లేదా ఓవర్‌టైమ్‌ను నియంత్రించే చట్టం రెండూ లేవు.
ముగింపు:
భారత జనాభా, చైనాను మించి ఉన్నది. ఇందులో యువతుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. జనాభా వలన ఉద్యోగాల కన్నా ఉద్యోగార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనిని సరితూగేటట్లు చేయటానికి ఎప్పుడూ సంపద సృష్టింపబడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడులు వచ్చి అందరికీ అవకాశాలు లభిస్తాయి. అవకాశాలను సరియైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అందరి జీవితాలూ కూడా సంపదతో నిండి ఉంటాయి. ఇందులో మహిళ పాత్ర గణనీయమైనది. ఆమె ప్రమేయం లేకుండా అభివృద్ధి సాధించడం కష్టసాధ్యమే!!

