బియ్యం ఎక్స్పోర్ట్ పై భారత్ నిషేధం(Biyyam export pai Bharat nishedham.)(India stopped exporting Rice in Telugu):
రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమై పంటల ఉత్పత్తి దెబ్బతిన్నది. ఇది దేశీయంగా కొరత భయాన్ని పెంచింది. దీనితో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని భారతదేశం నిషేధించింది. దేశీయంగా తగినంత లభ్యతను సమతుల్యం చేయటానికి అలాగే దేశీయ మార్కెట్లో ధరల పెరుగుదలను నియంత్రించడానికి ఈ చర్య తీసుకోబడింది, భారత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 2023 జూలై 20న ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచింది. దీనివలన సోనామసూరి బియ్యం దేశీయంగా అందుబాటులో ఉంటుంది.
ఎవరెంత?:
ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా 40% కంటే ఎక్కువగా ఉంది, ఇది 2022లో 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గణాంకాల ప్రకారం ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుల ఉమ్మడి షిప్‌మెంట్‌ల కంటే ఈ గణాంకం ఎక్కువ. భారత్ నుండి ధాన్యం దిగుమతి చేసుకునే దేశాలు వరుసగా థాయిలాండ్, వియత్నాం, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్. ఎగుమతి నిషేధం అనే ఈ చర్య భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం. ఇప్పటికే స్థానికంగా గత ఏడాది కంటే బియ్యం ధర 11% ఎక్కువగా ఉన్నదని అధికారులు నిర్థారించారు.
అమెరికాలో నివసించే భారతీయులు ఎక్కువగా మనదేశం నుండి దిగుమతి అయ్యే బియ్యం పైనే ఆధార పడి ఉంటారు. U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం, U.S. వినియోగించే బియ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ భారత్ నుండి దిగుమతి చేసుకుంటుంది.
భారతదేశం 140 కంటే ఎక్కువ దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది. భారతీయ బాస్మతీయేతర బియ్యాన్ని ప్రముఖంగా బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గినియా, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్ వంటి దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు ప్రధానంగా ప్రీమియం బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి.
2022లో 17.86 మిలియన్ టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది, ఇందులో 10.3 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యం ఉన్నాయి. అయితే సెప్టెంబరు 2022లో, భారతదేశం విరిగిన బియ్యం(నూకలు) ఎగుమతులను నిషేధించింది. వివిధ రకాల బియ్యం ఎగుమతులపై 20% సుంకాన్ని విధించింది.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు వరి ఉత్పత్తిలో కీలకమైన రాష్ట్రాలు. కానీ 2023లో రుతుపవన వర్షపాతం అస్తవ్యస్తంగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం తగ్గుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో జూన్ మధ్యకాలం వరకు భారీ వర్షాల లోటు ఏర్పడింది. జూన్ చివరి వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లింది.
వాస్తవానికి బియ్యం సరఫరా పై ఆంక్షలు అంతర్జాతీయ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని IMF తన ఆందోళనను వ్యక్తం చేసింది. ఎగుమతులపై ఆంక్షలను సడలించేందుకు భారత్‌ను అభ్యర్థిస్తాం అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది.
ఇక్కడొక గమనించదగిన విషయం. నిషేధం ఉన్నప్పటికీ, బియ్యం సరఫరా .కొన్ని దేశాలను దృష్టిలో పెట్టుకుని వాటి అవసరాలను తీర్చడానికి భారతదేశం ఎగుమతి కొనసాగించడానికి సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి, దేశీయ ధరలను అదుపు చేయటానికి గత సెప్టెంబరులో విరిగిన బియ్యం(నూకలు)ఎగుమతులను నిషేధించింది. అయితే ఇండోనేషియా, సెనెగల్, గాంబియా, మాలి, ఇథియోపియాలతో పాటు పలు దేశాలకు సుమారు మిలియన్ మెట్రిక్ టన్నుల బ్రోకెన్ బియ్యాన్ని విక్రయించడానికి ఆమోదాన్ని తెలిపింది.
దిగుమతిదారుల పెనుగులాట:
ఆఫ్రికన్ దేశాలలోని దిగుమతిదారులు బియ్యం అమ్మకాల కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దిగుమతిదారులు థాయిలాండ్, వియత్నాం వంటి అగ్రశ్రేణి బియ్యం ఎగుమతిదారులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఎల్ నినో ప్రభావం వలన దేశీయ సరఫరాలకు అంతరాయం కలిగితే, పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఇండోనేషియా ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
వరిసాగు క్లిష్టమైనది:
వరి సున్నితమైన పంట. మొలక దశలో 25 నుండి 28 ° C మధ్య ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది, అంకురోత్పత్తి సమయంలో 28 నుండి 30 ° C మధ్యకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలలో ఏదైనా గణనీయమైన తగ్గుదల లేదా పెరుగుదల ఉంటే అది ఉత్పత్తిపైన తీవ్ర ప్రభావం చూపుతుంది.
మంచి నీటిపారుదలతో దీనిని నియంత్రించగలిగినప్పటికీ, ఎల్ నినో ప్రభావం వలన సాధారణ వర్షపాతంపై ప్రభావం పడుతోంది. ఆసియాలోని పంట చాలా భాగం ఇప్పటికే మండుతున్న వేడి వల్ల దెబ్బతిన్నది, ఇది కొన్ని దేశాలలో వరి నాట్లు వేసే కాలాన్ని ఆలస్యం కూడా చేసింది. ఇటీవల భారతదేశం యొక్క రుతుపవన కాలం అస్థిరంగా మారింది. కొన్ని చోట్ల భారీగా వానలు పడుతుంటే మరికొన్ని చోట్ల అనూహ్యంగా పొడిగా ఉంటోంది. థాయ్‌లాండ్ ఈ సంవత్సరం సాధారణం కంటే 28 శాతం తక్కువ వర్షపాతాన్ని చూసింది.
వరి సాధారణంగా నీరు ఎక్కువగా అవసరమైన పంట. కాబట్టి సాధారణ వాతావరణం కంటే పొడి వాతావరణం పంట దిగుబడికి ప్రతికూలంగా మారుతుంది. వరి సాగు తీవ్రమైన శ్రమతో కూడుకున్నది. ఆసియాలో ఇది ప్రత్యేకంగా యాంత్రీకరింపబడలేదు.
ఎల్‌నినో తీవ్రత వలన పరిస్థితులు చక్క బడటానికి మరికొంత సమయం పడుతుందని, బియ్యం సరఫరా, ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన పరిణామాలు అంతవరకూ తీవ్రంగా ప్రభావం పొందే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం, భారతదేశ ఎగుమతి నిషేధం ప్రపంచ ఆహార గొలుసుకు పెద్ద షాక్‌ను కలిగిస్తోంది.
జూలై 1 నాటికి, భారతదేశంలో బాస్మతీయేతర బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు 41 మిలియన్ టన్నులు ప్రజా పంపిణీ వ్యవస్థకు, ప్రభుత్వ స్థాయి వాణిజ్య అవసరాల కొరకు రెండింటికీ సరిపోతాయి. ఇంతలో, వియత్నాం కూడా తన ప్రధాన పంటను తయారుగా ఉంచటం ప్రారంభించనుంది. ఇది ప్రపంచ బియ్యం సరఫరాపై ఒత్తిడిని మరింత తగ్గించగలదు.
