భారతీయులు. విదేశాలలో స్థిర నివాసం.(Bharateeyulu. videshalalo sthiranivasam) (Indians Migrating abroad):
విదేశాలలో స్థిర పడటానికి నిర్ణయం తీసుకోవడమన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన అంశం. ఇటు వైపుగా అడుగులు వేయటం అంటే స్వేచ్ఛ వైపు, స్వయం నిర్ణయాత్మక శక్తి వైపు అడుగు వేసినట్లే. క్లిష్టమైన నిర్ణయాన్ని చేరుకోవడానికి జాగ్రత్తగా చేసిన పరిశీలన, విశ్లేషణ, స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళిక అవసరం. భద్రత, స్థోమత మరియు నివాసం అన్నవి ఏ దేశమైతే కల్పిస్తుందో అక్కడికే వెళ్ళటానికి సుముఖత చూపటం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతీయులను ఇంకా ఇతర దేశాల ప్రజలను తమ దేశంలో నివాసం, జాతీయత(PR) కొరకు ఆహ్వానిస్తున్నాయి. ఐతే ఆయా దేశాల ఇమిగ్రేషన్ చట్టాలు అంత సులభ తరంగా పనిని ముగించనీయవు.
ఉత్తమ జీవన ప్రమాణాలు గల దేశాలు:
కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా, జర్మనీ,యూకేలు ఇమిగ్రేషన్ ఫ్రెండ్లీ దేశాలు(Immigration Friendly Countries)గా ఉన్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ మన ప్రవేశానికి కొంత సులభతరంగా ఉంటుంది.
అయితే ఉత్తమ జీవన ప్రమాణాల(Best living standards)ను కలిగి ఉన్న దేశాలు వేరే. అవి వరుసగా స్వీడన్, డెన్మార్క్, కెనడా, స్విట్జర్లాండ్,నార్వే,ఫిన్లాండ్, జర్మనీ, నెథర్లాండ్స్. ఇక్కడ ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ ఉండవు. క్రమబద్ధమైన జీవనాన్ని కలిగి ఉంటారు. పరిశుభ్రత, ఆకుపచ్చదనము ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాలు అన్ని దేశాలలో ఉండేవి కావు.
భారతీయ రుచులు:
భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలలో మొదటి స్థానములో ఉండేది యునైటెడ్ స్టేట్స్ అమెరికాయే(USA). దాదాపుగా 90 లక్షల భారతీయులు, భారతీయ సంతతి వారు నివసిస్తున్నారు. టెక్సాస్ లోనూ, టెక్సాస్ లోని హ్యూస్టన్ లోనూ ఉన్నవారికి ఒక్కొక్కసారి తాము భారతదేశంలో ఉన్నామా లేక అమెరికాలో ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. అచ్చంగా మన బెంగుళూరులో ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. చక్కటి సౌత్ ఇండియన్ హోటళ్లు, రుచులు లభిస్తాయి. రేడియో స్టేషన్స్ (హిందీ మరియు ఇతర భారతీయ భాషలు) చాలా ఉన్నాయి. బిర్యానీ(Biryani), ఫిల్టర్ కాఫీ(Filter coffee) వంటివి చక్కగా దొరుకుతాయి.
పాకెట్ ఫ్రెండ్లీ దేశాలు:
ఫిలిప్పీన్స్, పోర్చుగల్, వియత్నాం, సౌత్ ఆఫ్రికా, ఈక్వడార్, కోస్టారికా, మలేషియా, మెక్సికో, ఇండోనేషియా, బల్గేరియా. నివాసయోగ్యమైన గృహసదుపాయాలు కానీ, ఆహారం(Indian food) కానీ, ప్రయాణ ఖర్చులు కానీ అందుబాటులో ఉంటాయి. సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
విదేశాలకు వెళ్లడం వల్ల భారతీయులకు ఎక్కువ డబ్బు సంపాదించడం, ఎక్కువ డబ్బు ఆదా చేయడం మరియు సంపద సృష్టికి అవకాశం వంటి సామర్థ్యం(Strength) లభిస్తుంది. ఇదే అవకాశం వారికి భారత్ లో లభించదు. కారణాలు అనేకం. అత్యుత్తమమైనవి ఎంతో మెరుగైనవి అయిన ఉద్యోగాలు విదేశాలలో మాత్రమే లభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్థిర పడిన 45% భారతీయులు నిర్ధారించారు.
అమెరికా మరియు కెనడాలలో స్థిరపడడానికి ఎక్కడ బాగుంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇది కొంత చిక్కు ప్రశ్న. ఎందుకంటే రెండు దేశాలలోనూ వాటివాటి సౌలభ్యాలు ఉన్నాయి. అత్యంత మెరుగైన శాలరీ ప్యాకేజీ(Salary Package)లు అమెరికాలో ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేది సంపాదన గురించే కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. కెనడాలో మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మరిన్ని ప్రసూతి సెలవులు మరియు ఇతర సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. సంపాదనతో పాటూ ఇటువంటి అంశాలూ ముఖ్యమే. కానీ కెనడాలో సగటు పని గంటలు US కంటే కొంచెం ఎక్కువ. ఇదీ పరిస్థితి. ఆస్ట్రేలియా(Australila) విషయం తీసుకుంటే పై రెండు దేశాలకు మంచి పోటీనిస్తోంది. అత్యధిక జీవన నాణ్యత, ఉత్తమ విద్యా విధానం, బలమైన ఆర్థిక వ్యవస్థ, బహుళ సాంస్కృతిక మరియు సురక్షితమైన పర్యావరణం మాత్రమే కాక సహజ సుందరమైన అందం కారణంగా ఆస్ట్రేలియా నివసించడానికి ఉత్తమ దేశంగా పరిగణించబడుతుంది. స్వీడన్ లో విద్యావ్యవస్థ బలంగా ఉన్నది. యూరోపియన్ యూనియన్ వారికి ఇక్కడ చదువు ఉచితం. యూకేలో విద్య పరిశోధనాత్మకం గా సాగుతుంది. దీనివలన అభ్యసిస్తున్న చదువు పైన పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఈ వ్యవస్థ భారత్ లో మరింత మెరుగు పడాలి. యూరోపియన్ యూనియన్(European Union) నుండి బయటకు వచ్చిన తరువాత యూకేలో ఉద్యోగావకావకాశాలు గణనీయంగా పడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులలో యూరప్ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు సన్నగిల్లినాయి.
విద్యార్థులకు శుభవార్త:
విద్యార్థులకు శుభవార్త. అసలు పరీక్షలన్నవే లేకుండా ఉన్న దేశం ఒకటి ఉన్నది తెలుసా? ఫిన్లాండ్(Finland). అక్కడ విద్యార్థులు పై చదువులకు అర్హులయేటందుకు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తారు. మొత్తం విద్యార్ధి జీవితంలో తన 16వ, ఏట తప్పక రాయవలసిన ఏకైక పరీక్ష తప్పించి మరే విధమైన పరీక్షలు ఉండవు.
సింగపూర్ మరో మంచి ఆప్షన్. ఇక్కడ ఏకంగా లిటిల్ ఇండియా అనే ప్రదేశమే ఉన్నది. స్థిరపడటం మరియు సంఘంలో భాగం కావడం ఎంతో సులభం. నేర గణాంకాలు చాలా తక్కువ. దాదాపు మృగ్యమనే చెప్పవచ్చు. దానికి కారణం అక్కడి కఠినమైన చట్టాలు. జనాభాలో 1/4 భారతీయ మూలాలు కలిగిన వారు.. మీరు ఆహారం, భారతీయ సంస్కృతిని సింగపూర్ వ్యాప్తంగా ఎక్కడైనా కనుగొనవచ్చు. క్రికెట్ వరల్డ్ కప్(Cricket world cup) పోటీలు, ఐపీఎల్(IPL) పోటీలు వచ్చాయంటే, మనకు కావాల్సినన్ని భారతీయ గ్రూపులు కంట పడతారు. ఐతే బీర్ అన్నది తప్పనిసరి. ఇది కాకుండా వియత్నాం, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా, మలేషియాలో స్థిరపడిన కుటుంబాలు ఎన్నడూ కూడా తమ స్వంత ఇంటిని, ప్రదేశాన్ని కోల్పోతున్నట్లు కనపడదు. ఎక్కడైతే స్థిరపడదల్చుకున్నారో అక్కడి పర్మినెంట్ రెసిడెన్సీ పొందటం ముఖ్యం, లేకుంటే పొదుపు చేయటం, ఆస్తిని కూడబెట్టడం, ఇన్సూరెన్స్, ప్రభుత్వ ప్రయోజనాలు పొందటం వంటి సమస్యలు వస్తాయి.
ఉపసంహారం:
నికరంగా తేలిందేమంటే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యుకె, ఫిన్లాండ్ ప్రయోజనకారులుగా ఉన్నట్లు అగుపడుతున్నది. ఇది నేను వేసిన అంచనా మాత్రమే. ఈ వ్యాసం రాసె ముందు ఒకింత పరిశోధన చేయటం జరిగింది.అందులో కనుగొనబడిన సారాంశాన్ని ముందు ఉంచటం జరిగింది. చదువరులు విభేదించవచ్చు. అంగీకరించవచ్చు. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయటం ద్వారా తరువాతి వ్యాసాలు మరింత మెరుగ్గా అందించేటందుకు దోహదం అవుతాయి. అదే విధంగా ఇందులో కూడా మార్పులు చేర్పులు చేయటానికి అవకాశం ఉంటుంది.
