భారతీయులకి ప్రతి రోజూ పండుగే!!
విధము తెలియండి:
భారతదేశం జనసంఖ్య విషయంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. ఇది తాజా గణాంకాల వల్ల వెల్లడైన విషయం. 140 కోట్లకు దగ్గరగా ఉన్నది ఈ సంఖ్య. ఇందులో దాదాపుగా 110 కోట్ల మంది ఒక పండుగను చేసుకొని ఆనందిస్తున్నారంటే, వాతావరణం ఉత్సాహంతోనూ, ఆనందంతోనూ, భక్తిరసంతోనూ నిండిపోయి ఉంటుంది. హిందువులలో ప్రతి పండుగకు ప్రధాన కేంద్రం గుడి(Temple). ఏ విధమైన పండుగకైనా, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళటానికి ప్రాధాన్యతనిస్తారు. దైవదర్శనం వల్ల ఆనాటి పండుగ వాతావరణం ద్విగుణీకృతమౌతుంది. ఇది మన అందరికీ అనుభవమే. ప్రకృతి ఆరాధన(Nature worship) అన్నది భారతీయుల పండుగలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.అందువల్లనే తేదీలను బట్టి కాక, కాలాన్ని బట్టి, తిథులను బట్టి పండుగలు నిర్ణయించబడతాయి. ఇది ప్రకృతి ఆరాధనకు నిదర్శనం. ఉదాహరణకు బతుకమ్మ(Bathukamma)నే చూద్దాం., వానలు పడి చెట్టూ చేమా పచ్చదనంతో నిండుగా ఉన్న సమయంలో ఈ పండుగ జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఏమిటి అన్నది వేరే చర్చ. ఇది పూల పండుగ. ఆ కాలంలో దొరికే బంతి పూలు, తంగేడు పూలు వంటివే కాక ఇతర పూలను అలంకరించి, స్త్రీలు ఆటలు ఆడుతారు. పురుషుల సహకారంతో. ఆ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
సంపద సృష్టి, వితరణ:
దీపావళి(Deepavali), దసరాDasara, Dussehre), హోళీ(Holi), వినాయక చవితి(Vinayak Chaturthi) వంటి పండుగలు భారత ఉపఖండ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఇక్కడే గుడి అన్నది కీలక పాత్ర వహిస్తుంది. ఎట్లాగంటే గుడి కేంద్రంగా వేల కోట్ల రూపాయల సంపద చేతులు మారుతుంది. వితరణ జరుగుతుంది. వినాయక చవితి నే ఉదాహరణగా తీసుకుంటే, పందిళ్లు వేయాలి, ప్రతిరోజూ పూజకు సామాగ్రి కావాలి. పూలు సేకరించాలి. విగ్రహ ప్రతిష్టకు వేదిక కావాలి, పదకొండు రోజులకు గానూ భోజన సదుపాయాలు జరగాలి, వినాయక విగ్రహం తయారు చేయాలి, పూజకు పూజారి కావాలి, విద్యుద్దీపాల అలంకరణ జరగాలి, పదకొండవ రోజున నిమజ్జన ప్రక్రియకు వాహనం అవసరముంటుంది. ఇక్కడ గమనిస్తే, ఎంత మంది ఈ పండుగను జయప్రదం చేయటానికి తమ వంతు కృష్ణి, సహాయసహకారాలను అందించారో కనబడుతుంది. ఇక్కడ పేర్కొన్న పనులు కొన్ని మాత్రమే. ఐతే ఇవి ప్రత్యక్షంగా జరుగుతున్న పనులు, వాటిని చేసే కార్మికులు. ఈ కార్మికులకు పరోక్షంగా సహకరించే వారు అంతే సంఖ్యలో ఉంటారు.
పండుగలను భారతీయులు ఎంత నిష్ఠతో చేస్తారో: అంతే ఆనందంతోనూ చేస్తారు. ప్రతి దీపావళికి భారతీయులు చేసే ఖర్చు సుమారుగా 2.5 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇదే చాలు భారతీయ ఆర్థికవ్యవస్థ(Indian economic system)కు ఎంత ఊతం దొరుకుతుందో తెలియడానికి. 2022 సంవత్సరానికి గానూ, వినాయక చతుర్థికి 20,000 కోట్ల రూపాయల మారకం జరిగిందని లెక్కలు చెపుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల గణాంకాల ప్రకారం ఈ మారకంలో 30% వృద్ధి రేటును నిపుణులు గమనించారు.
తెలుగు రాష్ట్రాలలో:
మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు రెండు. దీని అర్థం మిగతావి జరుపుకోరని కాదు. ఈ రెంటినీ కూడా ఎంతో ఇష్టంగా, ప్రేమగా జరుపుకుంటారు. మొదటిది సంక్రాతి(Sankranthi) కాగా, రెండవది దసరా. సంక్రాతి పండుగ మళ్ళీ ప్రకృతి ఆరాధనే. చేతికందిన పంటను, తమకు తోడు నీడగా నించున్న పశు సంపదను కొలవటం ఈ పండుగ ప్రత్యేకత.
:ఎన్నో:
చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకునే పండుగ దసరా. తెలంగాణ ప్రాంతంలో జరిగే పూల పండుగ 'బతుకమ్మ', దేశవ్యాప్తంగా జరుపుకునే నవరాత్రులు, శక్తి ఉపాసకులకు ఈ తొమ్మిది రోజులు ఎంతో ప్రాముఖ్యమైనవి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు అన్నీ ప్రజలకు ప్రీతిపాత్రమైనవే. ఒక్కొక్క ఏకాదశిది ఒక్కొక్క ప్రత్యేకత. విష్ణు ప్రియంగా జరుపుకునేది ఈ ఏకాదశి. ఇవి కాక ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి. తిరుమల వేంకటేశ్వరస్వామికి మనం జరుపుకునే రెండు బ్రహ్మోత్సవాలు రెండు పండుగలు. ఒకసారి తెలుగు కాలెండర్ చూస్తే, మన గ్రామ దేవతల పండుగలు, వివిధ పుణ్య పురుషుల జయంతులు, దేశంలో ఏదో ఒక మూల ఉన్న నది పుష్కరాలు అన్నీ పండుగలు కదా!
దీపావళి అయిన తరువాత వచ్చే కార్తీక మాసం. మొత్తం నెల అంతా పండుగే. శివ ప్రధానంగా జరిగే ఈ మాసంలో విష్ణువునూ పూజిస్తారు. ఈ నెలలో వచ్చే ఏకాదశి(Ekadashi), పౌర్ణమి(Pournami), మాస శివరాత్రి ఎంతో పవిత్రమైన రోజులు. ఈ నెల రోజులు అయ్యప్ప స్వాములు చేసే కోలాహలం చూడ చక్కనిది. మరో నెల ఆగితే మొదలయ్యే ధనుర్మాసంలో విష్ణువు, గోదాదేవిల కళ్యాణం ఇంకా దాని ముచ్చట్లు. ఆ నెలంతా కూడా పండుగే. ఇన్నిటినీ తలుచుకొని, శ్రావణ మాసాన్ని వదిలేయగలమా? ఈ నెలలో వచ్చే శ్రీ కృష్ణ జన్మాష్టమిని కానీ, రాఖీని కానీ, నాగ పంచమిని కానీ ఎంతో ఇష్టంగా, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.
కేవలం కొన్ని పండుగలు ఉత్తర భారతదేశంలో మాత్రమే జరిగేవి ఉంటాయి. అవి వారికి మాత్రమే ప్రత్యేకం. మకర సంక్రాతి సమయాన జరుపుకునే 'లోహరి'(Lohri) అందులో ఒకటి. అటువంటిదే కార్తీక మాసంలో జరుపుకునే కరువా చౌత్(Karwa chauth). ఇలా చెప్పుకుంటూ పొతే భారతీయుల పండుగలకు అంతు అన్నదే ఉండదు. ప్రతి సందర్భాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవటం అన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం.:
ముగింపు:
భారతీయులకి ప్రతిరోజూ పండుగే!!

