భారతీయత పై సినిమా ప్రభావం.(Bharateeyata pai cinema prabhavam) (Impact of Indian cinema on society):

ప్రారంభం:

 సినిమా అన్నది భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. జీవితాలతో పెనవేసుకుని పోయింది. సినిమాకు, భారతీయ సమాజానికి మధ్యన ఒక విడదీయరాని బంధం ఉన్నది. భారతీయ సినిమా అంటే హిందీ చిత్రసీమ(Bollywood movies) అన్న ముద్ర పడిపోయింది. భారతీయ సినిమాని బాలీవుడ్ ప్రాతినిధ్యం వహిస్తోంది అన్నమాట ఒకరకంగా! ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమలు ఎన్నున్నా అవకాశం మాత్రం బాలీవుడ్ కే కే దక్కింది. 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉన్నది. ఎన్నో కావ్యఖండాలను సృష్టించింది అన్న మాటకు ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎంతోమంది ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు ఉన్నారు. మరి బాలీవుడ్ తన బాధ్యతను సరిగానే నిర్వహిస్తున్నదా?

:

ఆధునిక భారతీయ సినిమా ప్రభావం సమాజం పై చాలా ఉన్నది. భారతదేశంలోనే కాక దేశం వెలుపల కూడా అంతే ప్రభావాన్ని చూపగలుగుతోంది. ఎవరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా తన ప్రయాణం అప్రతిహతంగానే కొనసాగిస్తోంది. సినిమా అన్నది కేవలం వినోదాన్ని మాత్రమే పంచుతుంది అనుకుంటే పొరపాటే. అది ఒక జాతిని, ఒక జాతి విలువలను, ఒక సంస్కృతిని, ఔన్నత్యాన్ని మోస్తూ కీర్తిని చాటుతున్నాయి. చలనచిత్రాలు వీక్షకులకు సమాజం గురించి అప్పటివరకూ ఉన్న ఆలోచనా దృక్పథానికి భిన్నమైన దృక్కోణంతో అందించగలవు, వారి పరధులను విస్తృతం చేస్తాయి మరియు కొత్త మార్గాల్లో సమస్యలను ఆలోచింపజేసేలా చేస్తాయి. వారు సమాజంలోని వ్యక్తుల జీవితాలపై భిన్నమైన దృక్పథాన్ని అందించగలరు, వ్యక్తుల జీవితాలు మరియు వారి సంస్కృతులపై అంత:దృష్టిని అందించగలరు. 

సినిమా వల్ల ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది. అంతే కాక స్ఫూర్తి(Inspiration)నివ్వటంలో ఇదే అత్యుత్తమ సాధనం. సినిమా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. సమాజానికి, దేశానికి స్ఫూర్తినివ్వటంలో ముందు  వరుసలో ఉండే ఈ సాధనమే, హింసను, చెడు అలవాట్లను ప్రోత్సహించగలవు. అత్యాశకు గురిచేసి దారి మళ్ళేటట్లు చేయగలవు.  సినిమా అన్నది మామూలుగా కన్నా 4 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. సినిమాలు యువతలో విమర్శనాత్మకమైన ఆలోచనను రేకెత్తేలా చేస్తాయి., రాజకీయాలు, అసమానతలు, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి సంక్లిష్ట విషయాలపై ప్రతిబింబించేలా చేస్తాయి. ఆలోచింపజేసే చర్చలను ప్రోత్సహిస్తాయి, తాదాత్మ్యతను ప్రోత్సహించి మార్పుకు మారుపేరుగా యువతరాన్ని ప్రేరేపిస్తాయి.

చలనచిత్రం భావాలను, ఆలోచనలను, కథలను, కథనాలను, అనుకరింపులను, అనుసరింపులను, అందాన్ని అందించే గొప్ప దృశ్యకళ(Visual art).  ప్రపంచం మరింత మెరుగ్గా ఉండటానికి, మంచి చేయడానికి ప్రజలను ప్రేరేపించగలదు, అదేసమయంలో ప్రతికూల సందేశాలు మరియు విలువలను కూడా ప్రోత్సహించగలరు. ముందే అనుకున్నట్లుగా రెండు వైపులా పదునున్న కత్తి. సినిమా వంటి అద్భుతమైన విద్యామాధ్యమం. ప్రపంచం నలుమూలల నుండి విభిన్నమైన సంస్కతి సంప్రదాయాలను ఒకేచోట చేర్చి చూపగలదు. అంతేనా!! కాదు. భిన్నమైన సమస్యలపై స్పందించి, అవగాహనాశక్తిని పెంపొందించే శక్తి కూడా కల్గి ఉంది.

2020 కి గానూ 183 బిలియన్ల సంపత్తిని పోగుచేయ గలిగింది. కరోనా(Corona) మహమ్మారి రాకుంటే ఈ సంపద మరింత ఎక్కువగా ఉండేదని అంచనా. ప్రభావం చూపడం, ప్రతిబింబించడం అన్న వాటి మధ్య గీత చాలా సన్ననిది. సినిమా అనేది సమాజాన్ని ఎక్కువగా ప్రతిబింబించే అద్దం వంటిది మాత్రమేనని మరియు జనాదరణ పొందిన సంస్కృతిని మరియు సమస్యలను స్వల్పంగా సవరించడం ద్వారా  ప్రభావితం చేయడం తప్పు కాదు. ప్రజల నమ్మకాలు మరియు అభిప్రాయాలు  వైఖరులపై సినిమా ప్రభావాన్ని అధ్యయనం చేశారు. చలనచిత్రాలు స్త్రీ పురుష భేదంపై మరియు జాతి పద్ధతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఎంత మాత్రమూ మంచి సంకేతం కాదు. ఆధునిక యుగంలో, ప్రపంచం కొత్త పుంతల వైపు పరుగులు తీస్తున్న సమయంలో ఇటువంటి పాతకాలపు ఆలోచనలను రేకెత్తించి, అనవసరమైన వివాదాన్ని సృష్టించడం అన్నది అరిగిపోయిన పథ టైరు లాంటిది. ఆలోచనా పరిధి తగ్గుతుంది. నటీనటులపై తమకున్న అభిమానంతో వారు చేసిన పనే సరియైనది అన్న ఆలోచన బలపడి, తామూ అదే విధంగా ప్రవర్తిస్తారు. తమ అభిమాన నటులను, నటీమణులను అనుకరించడం అనే ప్రక్రియ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది. శారీరక శ్రమను, చదువును నిర్లక్ష్యం చేసే ప్రమాదమున్నది.

మహిళ అంటే అందానికేనా?: 

అమ్మాయిలను ప్రేమలో పడేయటం కోసం హీరో చేసే విన్యాసాలు కొన్ని చోట్ల అతి వికృతంగా ఉంటాయి. వెంట పడతాడు, ఏడిపిస్తాడు, పాటలు పాడతాడు, ఆమె పని ప్రదేశానికి వెళ్తాడు. మళ్ళీ పాడతాడు. ఆమె పడిపోతుంది. తరువాత మిగతా సినిమా. కానీ నిజ జీవితంలో కాదు సుమా!! ఇక్కడ అయితే వెంటనే 'షీ టీమ్'(She team) పోలీసులు దిగుతారు. హీరో గారు జైల్లో ఉండొచ్చు. అందం అనే భావనకు కొత్త అర్థాన్ని తీసుకొచ్చి అంటగట్టింది బాలీవుడ్. శారీరకమైనదే అందం అన్న భావన అందఱిలోనూ నాటుకుపోయింది. కాలేజీలో కానీ, పని ప్రదేశంలో కానీ అందం అన్నది శారీరక ఆకృతి, హెయిర్ స్టైల్, బ్రాండెడ్ బట్టలు మాత్రమే(Lavish lifestyle). ఇది మనకు మాధ్యమం ద్వారా నేర్పించబడ్డది. నిజానికి ఇది శుద్ధ తప్పు. అమ్మాయిలు 'మంచి దృక్పధం ఉన్న వ్యక్తి నాకు భర్తగా కావాలి, నన్ను నా ఆలోచనా సరళిని ఇష్టపడే వ్యక్తి కావాలి' అని అడగరు.  ఫలానా హీరో లాగా చేతులు చాపే వ్యక్తి కావాలి, ఫలానా హీరో లాగా స్టెప్పులు వేసే వ్యక్తి కావాలి అని అడిగినా ఆశ్చర్యం లేదు. స్థోమత తెలుసుకుని మెలగటం అన్నది ఉండదు. మన వల్ల కాకపోయినా ఖరీదైన బట్టలు, జీవన విధానానికి ఇష్టపడతారు. విద్యార్థులు బాలీవుడ్ నటీనటుల వెనుక పరుగెత్తుతున్నారు, తమను తాము "అభిమానులు"(Fan)గా చెప్పుకుంటున్నారు మరియు సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో గంటల తరబడి గడిపి తమ చదువులను నాశనం చేసుకుంటున్నారు. ఇది కడు శోచనీయం.

వ్యక్తిత్వం పై సినిమా ప్రభావం:

మనస్తత్వంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. సినిమా 2 నుంచి 3 గంటల వ్యవధిలోనే అన్ని రకాల భావోద్వేగాలకు లోనవుతారు. ప్రేమ, ద్వేషం, ప్రతీకారం, క్రూరమైన హింస, అత్యాచారం మరియు అనేక ఇతర అవాంఛనీయ కార్యకలాపాలు ఇంత తక్కువ వ్యవధిలో చూపబడతాయి. ప్రభావం అన్నది వ్యక్తి యొక్క మానసిక స్థితిపై ఆధార పడి ఉంటుంది. కొంతమంది సరదాగా తీసుకుని వదిలేయవచ్చు. సున్నిత మనస్కులు, మానసికంగా అస్థిరంగా ఉన్నవారి ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులు, యువత పైన సూటిగా ప్రభావం పడుతుంది. సిగరెట్ తాగటం, పబ్ కి వెళ్లి మద్యపాన సేవనం(Booze) చేయటం ఆధునికతగా భావిస్తారు. తమ మాతృభాషపై పట్టు రాదు. అంతేకాక ఒకానొక విచిత్రమైన భాషను ఏర్పర్చుకుని అదే స్టైల్ గా అనుకుంటారు.

భాష, సంస్కృతిపై తీవ్రంగా ప్రభావం చుపుతున్నాయి చలనచిత్రాలు. మనవి కాని పేర్లను, వేషము, భాషను మాట్లాడుతూ లేదా ధరించి తిరుగుతూ ఆధునికతకు ఇదే పరమార్థం అని చెప్తున్నాయి. ఒక సందర్భంలో ఒక యువతి తన కలని సినిమాలోని పాటలలో హీరోయిన్ లాగా విదేశాలు తిరగాలని ఉన్నదని వెల్లడించింది. ఒక యువకుడు తన ఖరీదైన కారు ఇంట్లోని పడక గది వరకు దూసుకెళ్లే టటువంటి  మేడ కావాలని తన కలను వివరించాడు. అది కలగానే ఉంటె పరవాలేదు. తరువాతి రోజులలో దానిని సాకారం చేసుకునేందుకు ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే కష్టం.

ముగింపు:

సినిమా అన్నది సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సకారాత్మకంగానే కావచ్చు, నకారాత్మకంగానే కావచ్చు. ఒకటే విషయాన్ని పదిసార్లు చూపటం వల్ల అది మాత్రమే నిజం అనుకునే సమాజంలో ఉన్నాం. మంచి చెడులను తూకం వేసే పరిస్థితులలో తల్లిదండ్రులు లేరు. యువతకు విడమరచి చెప్పేవారు లేరు. ఉన్న దానిని ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకుని, ఆపాదించుకుని, పాటించేయటం వర్తమాన సమాజంలో జరుగుతున్న పరిణామం.