సమాజం పైన సోషల్ మీడియా పలుకుబడి. (bharateeya samajam. Social media palukubadi)(Social media influence on society):

పరిచయం: 

5G ఇంకా: పూర్తిగా సామాన్య జనంలోకి రానేలేదు రాలేదు. ఈ 4G నే చాలా వేగంగా ఉన్నది. అటువంటిది 5G కూడా వచ్చిందంటే!!:

సమాజం అంటేనే మార్పు. నిరంతరంగా జరిగే మార్పు. కొత్త నీరు వచ్చిందంటే పాత  నీరు జరగాల్సిందే. ఈ నాటి కొత్త నీరు రేపటికి పాతది. వర్తమానంలో భారతదేశంలోని ప్రజలకు మొబైల్ అన్నది ఒక హస్త భూషణం అయిపోయింది. చేతిలో మొబైల్ లేకుండా మనిషిని మనం చూడము. ఈ నయా జమానాలో అన్నీ కూడా ఫోన్లో నుండే.


బ్యాంకింగ్ కానీ, డబ్బుల ట్రాన్స్ఫర్ కానీ, ఉత్తరాలు కానీ, పెళ్లి ఫోటోలు కానీ ఒకటేంటి అన్నీ. మరి అదే జనం సోషల్ మీడియా కి ఎంతగా అలవాటు పడ్డారు? ఎంతలా ఉపయోగిస్తున్నారు? ఎంతమంది ఆమోదించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మిశ్రమంగా ఉన్నాయ్. ఎందుకంటే ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చూస్తున్నారు. అనుభవం చేస్తున్నారు. సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా ప్లేట్ ఫార్మ్స్ అన్నవి మన జీవితాలలోకి మన అనుమతి  లేకుండానే  ప్రవేశించాయి. వాటి ప్రవేశం అన్నది ఎవరూ గుర్తించలేదు. అంత నిశ్శబ్దంగా వాటి ప్రవేశం జరిగింది. అయితే వాటికీ ఆహ్వానమూ అంతే బ్రహ్మాండంగా పలికాము. డిజిటల్ మీడియా వలన నష్టము, లాభము రెండు ఉన్నాయి అంటే రెండు వైపులా పదునున్న కత్తి అన్నమాట.

అనుకూలతలు:

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ, మరొకరితో క్షణాలలో సంప్రదించవచ్చు. ఏ వార్త అయినా, విషయం అయినా కోట్లాది మందికి ఆ సమయం లేదా మరో సమయం  అన్న తేడా లేకుండా అందజేయవచ్చు. కుగ్రామంగా మారిన ఈ ప్రపంచంలో ఎవరితోనైనా కనెక్ట్ అయిపోవచ్చు. సామజిక, సాంఘిక కార్యకలాపాలలో తెలీని ప్రాంతాలలో కూడా పాల్గొనవచ్చు. దీని వలన సేవాభావం కలవారు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, కొత్త కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన  వరం. ఇంటి వద్దనే ఉండి, ఆరవ తరగతి పాఠాల మొదలు UPSC దాకా,  ఐటీ దాకా, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మాథ్స్, కామర్స్ వంటి తమకు అవసరమైన అన్నిటిలోనూ సామర్థ్యం సాధించవచ్చు.



మనకున్న విషయ పరిజ్ఞానం పైన నవీకరణను పొందవచ్చు. విషయ పరిజ్ఞానంలో అప్గ్రేడ్ అవవచ్చు. ఎందుకంటే ఫీడ్ బ్యాక్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల(Expert) నుండి పొందవచ్చు. మనకు తెలిసిన విషయాలను షేర్ చేయవచ్చు. నవ్యమైన, ఎంతో ఉత్సాహాన్ని కలిగించే కొత్త విషయాలను, వ్యక్తులను కలవవచ్చు. డిజిటల్ మీడియాలో గడిపిన సమయం ఎంతో ఉత్తేజంగా ఉంటుంది.

వ్యాపారం చేసేవారికి కూడా ఎంతో సహాయం అందిస్తుంది ఈ సోషల్ మీడియా. ఇందులో వాణిజ్య ప్రకటనలు జొప్పించటం చాలా సులభం. అవసరమున్న వ్యక్తితో చాట్ చేసి, అవసరమైన వివరాలను షేర్ చేసి తమ వ్యాపారం లాభదాయకం చేసుకుంటారు. అటు కొనుగోలుదారుడికి కూడా తాను అనుకున్న వస్తువు అనువైన ధరలో ఎంతమాత్రం రాజీ పడకుండా పొందవచ్చు.

గణాంకాలు:

2022 గణాంకాల ప్రకారం భారత్ లో సోషల్ మీడియా ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య దాదాపుగా 470.1 మిలియన్లను దాటి వుంది. ఇది సాలీనా 4.2% చొప్పున పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న మాధ్యమం  ఫెస్బుక్. ఇది ప్రధమ స్థానంలో వుంది. తరువాతి స్థానాన్ని యూట్యూబ్  ఆక్రమించింది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ తరువాతి స్థానాలను ఆక్రమించాయి. సగటున 2.30 గంటల సమయాన్ని ప్రతి మనిషి ఈ డిజిటల్ మీడియా కొరకు ఉపయోగిస్తున్నాడు. ఈ డిజిటల్ మీడియా ను ఎక్కువగా ఉపయోగించే వారిలో మొదటి స్థానంలో ఉన్నది చైనా 10,201.94 మిలియన్ల యూజర్లతో అక్కడి మీడియా భాసిల్లుతోంది. రెండవ స్థానం భారత్ ది. 755.47 మిలియన్లతో. మూడవ స్థానంలో అమెరికా. యూజర్ల సంఖ్య 302.25 మిలియన్లు.

భారత్ లో డిజిటల్ మీడియా ను అధిక శాతం ఉపయోగించేది యువతే. అందులోనూ 13 నుండి 19 సంవత్సరాల వయసు వారు ఉపయోగిస్తున్నారు. ఇది ఒకింత ప్రమాదకరం. స్త్రీ పురుషుల నిష్పత్తిలో ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని కూడా పరిశోధన జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా తీసుకోబడిన గణాంకం. దానికి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఇవ్వబడ్డది. అమ్మాయిలు 15 సంవత్సరాలు ఆ పైబడి ఉన్నవారు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

చెడు ప్రభావం:

సోషల్ మీడియా ప్రభావం వలన వాస్తవికత నుండి దూరం జరిగి, ఊహాత్మకమైన జీవనానికి అలవాటు పడతారు. సోషల్ మీడియా అన్నది ఒక వ్యసనంగా మారుతుంది.సైబర్ నేరాలకు(Cyber crime) పాల్పడుతున్నారు. దీని వలన ఆందోళన పెరుగుతుంది. ఇదే డిప్రెషన్ కి కారణమౌతుంది. ఊహాత్మకమైన స్నేహితులు పెరిగి, మనిషి ఒంటరిగా అయిపోతాడు. పోలిక(Comparison) పెరిగిపోవటం తో సమాజంలో తాను తక్కువ అన్న ఆలోచన పెరిగి మరింత ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. మనిషి పైన, కుటుంబం పైన, సమాజం పైన డిజిటల్ మీడియా యొక్క చెడు ప్రభావం స్లో పాయిజన్ లా వ్యాపిస్తోంది అనేకన్నా వ్యాపించింది అంటే సబబు. అవసరమైన విషయం ఎంత ఉంటుందో, అంత కన్నా అనవసరమైన విషయాలూ ఉంటాయి. యువత చాలా సులభంగా వీటి ఆకర్షణకు గురి అవుతారు. పర్యవసానం సామాజిక బెదిరింపులు(Social bullying). ఇది సాధారణంగా ఉండదు. ఒక రేంజ్ లో ఉంటుంది. సున్నిత మనస్కులను కాసేపు పక్కన పెడితే, మానసికంగా బలవంతులు కూడా దీనికి బలి ఐన సంఘటనలు బోలెడు. నిద్ర లేమి కూడా ఒక ఇబ్బంది,. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పుకార్లు క్షణాలలో చక్కర్లు కొడతాయి. దేశాలు దాటుతాయి. ఎంతైనా అవాస్తవమైన సంగతులు ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటాయి కదా!!


చిన్న పిల్లలను ఫోన్ లను చూడకుండా ఆపలేము. అదే సమయంలో వారు వీక్షించే కంటెంట్ ని కూడా మనం గమనించలేము. చూసేది సరియైనదేనా లేక వారికి ఎంత మాత్రం అవసరం లేనిదా అన్నది మనం జడ్జ్ చేయటానికి కష్టం.

ఉపసంహారం:

వ్యాసం మొదట్లోనే కొత్తనీటికి స్వాగతం పలుకుతూ పాత నీరు జరగవలసిందే అని అనుకున్నాం కదా! మీకు గుర్తుందో లేదో. 80లలో, 90లలో మన చిన్నతనాన మన తల్లిదండ్రులు మనలను విపరీతంగా కోప్పడేవారు. కారణం వార పత్రికలు తెగ చదివేస్తున్నామని, దూరదర్శన్(Doordarshan) తెగ చూసేస్తున్నామని పిల్లవాడు/పిల్ల పాడైపోతున్నారని గుర్తొచ్చింది కదూ. అప్పట్లో వారపత్రికలు చదివి, లేదా టీవీ చూసి మనలో ఎంతమందిమి పాడైపోయాం? లేదు కదా. ఎందుకంటే ఆ రోజులలో విద్యార్థులకు, మహిళలకు మిగతా అందరికీ ఈ రెండే కాలక్షేపాలు కాబట్టి. వదలకుండా వాటి వెనకే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ వార పత్రికల స్థానాన్ని, దూరదర్శన్ స్థానాన్ని ఈ సోకాల్డ్ డిజిటల్ మీడియా ఆక్రమించింది. ప్రస్తుతం మనమూ అంతే. మన తల్లిదండ్రుల స్థానంలో మనమున్నాం. మన స్థానం లో మన పిల్లలు. విషయం  అర్థమైందనుకుంటాను. మనలాగే మన పిల్లలూ యోగ్యత సాధించి విజయవంతమైన జీవనాన్ని గడుపుతారు అని ఆశిద్దాం.