భారతీయ సమాజం బాలీవుడ్ ను ఎందుకు తిరస్కరించింది?(Bharateeya samajam bollywood nu enduku tiraskarinchindi?):
సినిమా అన్నది భారతీయుల కనీసపు వినోదం. రాబడిని బట్టి ప్రతి కుటుంబమూ నెలకు రెండు లేదా మూడు సినిమాలు చూస్తారు భారతదేశంలో. ఖర్చు తక్కువగా అయి, అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా మాత్రమే. దేశ వ్యాప్తంగా సగటు మానవుడు తనను తాను సంతోషపరచుకోవటానికి ఉపయోగించే సాధనం సినిమా. బుద్ధి జీవులు వినోదాన్ని పంచే ఈ మాధ్యమాన్ని తమ ప్రయోజనాలకు వాడుకున్నారు. అది ఎలాగ? సినిమా అన్నది రెండుగా విడగొట్టబడి ఉన్నది ఇక్కడ. దక్షిణ భారత దేశ సినిమా ఇంకా బాలీవుడ్(హింది చిత్ర సీమ). 2018 సంవత్సరానికి గానూ, హిందీ చిత్రపరిశ్రమ 3,800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఇది గత సంవత్సరాని కన్నా 10% నుండి 15% ఎక్కువ. 2019కి గానూ, 4,350 కోట్లు ఉండగా, 2020లో కరోనా కరణంగా కలెక్షన్లు భారీగా తగ్గి, 1338 కోట్లకు పడిపోయింది.
తిరస్కరణ:
హిందీ చిత్ర పరిశ్రమను ఎంతగానో ఆదరించిన భారత ప్రజానీకం ఉన్నట్లుండి మూకుమ్మడిగా తిరస్కరించడం మొదలు పెట్టారు. ఈ ధోరణి 2020 నుండి మొదలు అయింది. ఎంతలా అంటే, సినిమాకి పెట్టిన ఖర్చు ఎలా ఉన్నా, ప్రమోట్ చేయటానికి ఐన ఖర్చు కూడా సినిమా విడుదల తరువాత వెళ్లదీసుకోలేనంత. ఈ ఫ్యాషన్ వర్తమానంలోనూ కొనసాగుతూనే ఉన్నది. ఇందులో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం ఖచ్చితంగా సోషల్మీడియా మాత్రమే. ఎందువలన #BoycottBollywood ఊపందుకున్నది?
కారణాలు:
బాలీవుడ్ తనను తాను భారతీయ సినిమాగా ప్రకటించుకున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాను విడుదల చేసి, తాము చూపినది, చేసినది మాత్రమే భారతీయత అని ప్రకటించుకున్నది. మరి అంతే బాధ్యతగా ప్రవర్తించిందా అంటే లేదు. హిందీలో వచ్చిన దాదాపు అన్నీ సినిమాలు రీమేక్ లే. ఏదీ స్వంత స్క్రిప్ట్ కాదు. కరోన లాక్ డౌన్ సమయంలో భారతీయులు కావలసినంత సమయం దొరకడంతో పాటు, ఎన్నో రకాల ఒటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావటం వలన ప్రాంతీయ సినిమాలను చూడటం మొదలు పెట్టారు. దక్షిణ భారతదేశ భాషలైన మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషలలొ సినిమాలను చూసి నజానిజాలను గ్రహించడం మొదలు పెట్టారు. ఒరిజినల్ కధలను, కథనాలను, నిజమైన భారతీయతను ఆస్వాదించడం మొదలు పెట్టారు. జైల్ లో ఉన్నప్పుడు వారు పెట్టిన తిండే తినవలసి ఉంటుంది. ఖైదీకి ఎంపికలంటూ ఉండవు. బాలీవుడ్ ప్రేమికుల పరిస్థితి కూడా అట్లాగే ఉండేది 2020 వరకూ. కరోనా, లాక్ డౌన్, OTT ప్లాట్ ఫామ్ లు ఆకలిని మనసారా తీర్చాయి. భారతదేశపు సినిమానే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యద్భుతమైన ఆవిష్కరణలను చూడటం మొదలు పెట్టారు. ఇదే హిందీ సినిమా తిరస్కరణకు ప్రధాన కారణం.
ఇది మాత్రమే కారణమా?:
కాదు. ఒటీటీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంటెంట్ ని వీక్షించడం వలన బాలీవుడ్ మూస చిత్రాలు భారతీయుల అసహ్యంతో కూడిన తిరస్కరణకు గురి అయినై. బంధుప్రీతి అన్నది పరిశ్రమ నరనరాన జీర్ణించుకుని దానికి అనుగుణంగానే వ్యవహరించడం చేసింది. నటన ఎంత చెత్తగా ఉన్నా సరే, వారినే ప్రోత్సహించింది. చక్కని ప్రతిభా పాటవాలున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి వర్ధమాన నటులను బాహాటంగానే వెలి వేశారు. పరిశ్రమలో మూలస్తంభాలుగా చెప్పుకునే సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, ఆలియాభట్, సోనమ్ కపూర్ వంటి వారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. బయటి వాడు అవటం వలన హిందీ చిత్ర పరిశ్రమ అతడిని వెంటాడి, వేటాడి చంపింది. జూన్ 14 2020 న సుశాంత్ తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని మరణించాడు. అది హత్య అని, కాదు డ్రగ్స్ ఎక్కువ అవటం వల్ల చేసుకున్న ఆత్మహత్య అని వేరు వేరు కథనాలు ఉన్నాయి.
భారతీయ సాంప్రదాయాలను కాక బాలీవుడ్ తనదైన స్వంత సంస్కృతి సాంప్రదాయాలను సృష్టించి అది మాత్రమే నిజమని నమ్మించేందుకు ప్రపంచం ముందు ఉంచింది. దానికే భారతీయత అని చక్కెర పూత వేసి ప్రక్షకులకు వడ్డించింది. అయితే ఇది వారికి ఎంత మాత్రం రుచించలేదు. దక్షిణ భారతదేశ చిత్రాలు తమదైన శైలిలో సినిమాలను నిర్మించి విడుదల చేయటం వలన ఉత్తరాది ప్రేక్షకులకు ఎడారి మధ్యలో ఒయాసిస్ లాగా అనిపించింది. బాహుబలి ద్వారా ప్రేక్షకులకు కావలసినది దొరికింది. చిత్రాన్ని ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఆదరించారు. వారికి కావలసినది దొరికింది. క్రమంగా దక్షిణ భారత దేశపు చిత్రాలను ఆదరించడం మొదలు పెట్టారు.
యువత సాధారణంగా హీరోలను, హీరోయిన్ లను తమతమ ఐడియల్ హీ లేదా ఐడియల్ షీ లు గా చేసుకొని వారిని అనుకరించడానికి ప్రాధాన్యత చూపుతారు. తప్పుడు సందేశం సమాజంలోకి వెళ్ళడం వల్ల ఈ తరం వారి మనసు పైన, వారి ప్రవర్తన పైన తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా వారిలో ఆత్మన్యూనతా భావం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇతర కారణాలు:
హిందీ పరిశ్రమ నిజానికి దూరంగా జరిగింది. తనదైన శైలిలో కంటెంట్ ని క్రియేట్ చేసి అది మాత్రమే నిజమని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రేక్షకులను ఎంతకాలమని ఇట్లా నమ్మించగలుగుతారు!! ఒటీటీ ప్లాట్ ఫామ్స్ పుణ్యమా అని కాపీ సినిమాలను కాక అసలైన కంటెంట్ ని వీక్షించే అవకాశం దొరకడంతో సమాజం నుండి హిందీ చిత్ర పరిశ్రమ దూరం జరిగింది.
మెజారిటీ ప్రేక్షకుల మనోభావాలకు ఎంతమాత్రం విలువనివ్వకుండా సినిమాలు నిర్మించడం ఒక కారణం. ఆమిర్ ఖాన్ నిర్మించిన పీకే ఇందుకు ఒక ఉదాహరణ. అంతేకాకుండా తన భార్య అయిన కిరణ్ రావ్ భారతదేశంలో అభద్రతాభావంతో ఉంటున్నదని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు.
వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకునే బాయ్కాట్ ట్రెండ్ ఊపందుకున్నది. బాయ్కాట్ బ్రహ్మస్త్ర, బాయ్కాట్ లాల్ సింగ్ చద్దా, బాయ్కాట్ రక్షాబంధన్, బాయ్కాట్ పఠాన్ అంటూ సినిమాలను తిరస్కరించి ప్రేక్షకులు తమ నిరసనను తనివితీరా తీర్చుకున్నారు.
ఉపసంహారం:
బాలీవుడ్ ది కేవలం ఒక ఆత్మహత్య మాత్రమే. తానంతట తాను తీసుకున్న గోతిలో స్వయంగా దూకి కప్పెట్టుకున్నది. అయితే గతంలో చేసిన తప్పులను గ్రహించి, ప్రవర్తనను మార్చుకుని, సమాజం దేనినైతే అంగీకరిస్తుందో, ఇష్టపడుతుందో గ్రహించి ఆ కంటెంట్ నే ఇస్తే తప్పక మళ్ళీ కోలుకునే అవకాశం ఉన్నది.
