భారతీయ మధ్యతరగతి వర్గం. పురోగతి.(bharateeya madhyataragati vargam. purogati)(Economic development of India. Participation of Middle class society):

 పరిచయం:

భారత దేశపు ఆర్థిక వ్యవస్థ(Indian economy)ను శాసించే స్థితిలో ఈనాటి మధ్యతరగతి(Middle class) వారున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వారి అంచనా ప్రకారం ప్రస్తుతం వారి సంఖ్య 55% మించి ఉన్నది. పరిశోధకులు వారి వారి మన:స్థితిని, వారికి అర్థమైన విషయాలను బట్టి మధ్యతరగతి అన్న పదానికి నిర్వచనాన్ని ఇచ్చేశారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ లు తాము నిర్వచించిన సిద్ధాంతంలో ఈ తరగతి వారిని ఇమిడించేందుకు చాలా ప్రయత్నం చేసారు.  చాలా పరిశోధనలు నిర్వహించారు. దీని కోసం వారు వారికి అందుబాటులో ఉన్న వారి సోషల్ మీడియాను, వారి ఆదాయాన్ని, వృత్తి నైపుణ్యాలను, వారు నివసించే గృహాలు, జీవన నైపుణ్యాలు వంటివి తీసుకున్నారు.ఈ ఫ్రేమ్ వర్క్ మాత్రమే కాక,  ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే(2011-12) నుండి కూడా డేటాను సేకరించి పరిశోధించారు. ఈ సర్వేల ఆధారంగా, డేటా ఆధారంగా భారత పౌరులను వివిధ తరగతుల కింద విభజించడం జరిగింది. గృహ వినియోగం, కొనుగోలు శక్తి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గృహ యాజమాన్యం వంటివి పరిగణనలోకి తీసుకున్నారు. మధ్యతరగతి కుటుంబీకులతో అత్యధిక శాతం ఉద్యోగస్తులే. నెలాఖరుకు వచ్చే జీతంపై ఆధార పడే వాళ్ళే. మళ్ళీ ఈ తరగతి వారిని మూడు భాగాలుగా విభజించగా అందులో 28% వారు మధ్యతరగతి కింద గుర్తించబడ్డారు.


14% దిగువ మధ్యతరగతి వారుగానూ, 3% ఎగువ మధ్యతరగతి వారుగానూ గుర్తిపబడ్డారు.మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మధ్యతరగతిలోనూ, ఎగువ మధ్యతరగతి లోనూ అధిక శాతం కుటుంబీకులు పట్టణాలలో కంటే, పల్లెటూర్లలో జీవనం సాగిస్తున్నారు. పల్లె జీవితాన్ని ఎంచుకోవడానికి కారణం  పట్టణాలలో కన్నా పల్లెటూర్లలో జీవన భద్రత ఎక్కువ. అంతేకాకుండా జీవనవ్యయమూ అదుపులో ఉంటుంది. రోజువారీ ప్రక్రియలకు సౌకర్యాలు అందుబాటులో లేకుంటే,  పల్లెటూర్లలోనే వాటి కల్పనకు పూనుకోవచ్చును. తాము నివసిస్తున్న ప్రాంతం నుండి పనిచేసే ప్రాంతం దగ్గరగా ఉండేటట్లుగా అంటే అందుబాటులో ఉండే విధంగా నివాసాన్ని ఎన్నుకోవటం ఉత్తమంగా భావిస్తున్నారు. పిల్లల చదువులకు, ఇంటికి కావాల్సిన సమస్తమైన వస్తువులు దొరికే సూపర్ మార్కెట్ వంటి మల్టీ స్టోర్ ల ఏర్పాటు, వినోదము, ఆరోగ్యము ఇటువంటి సౌకర్యాలు తమ నివాసాలకు దగ్గరగా ఏర్పాటు అయ్యేటట్లుగా చూసుకుంటున్నారు.

మధ్యతరగతి మనస్తత్వం:

మధ్యతరగతి అన్న భావన అతి విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. దాని పరిధి చాలా పెద్దది. ఐతే దీనిని అర్థం చేసుకోవటానికి లేదా పరిశోధించడానికి అంతే విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. ఒక రకమైన ఆరోపణ ఏమిటంటే, ఆర్థిక వేత్తలు ఈ సామజిక తరగతి గురించిన పరిశోధనలు రాజకీయ నాయకుల కోసం చేస్తున్నారని. ఏది ఏమైనా ఈ తరగతి వారిపై విశ్లేషణాత్మకంగా చర్చ సాగింది, సాగుతోంది. మధ్యతరగతి వారి కోరికలు, ఆకాంక్షలు కొంత సంక్లిష్టంగా ఉంటాయనేది వాస్తవం. దీనికి ప్రధాన కారణం వారి ఆదాయ వనరు స్థిరాస్తి నుండి కాక స్వార్జితం పై ఉండటమే!! జాతీయవాదాన్ని కలిగి ఉంటారు. దైవభక్తిని, కుటుంబం పట్ల బాధ్యతను(Family responsibilities) ఎల్లవేళలా ప్రదర్శిస్తూ ఉంటారు. దయ, గౌరవం, కరుణ, గర్వం మరియు అసూయ వంటి భావాలు, ధిక్కారం మరియు అవమానం వంటివి సమయాన్ని, సందర్భాన్ని బట్టి  ప్రదర్శిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఇటువంటి భావాలకు వీలైనంత దూరంగా ఉంటారు. వీరికి రాజకీయ ప్రపంచం కొరుకుడు పడని విషయం. ఐతే ఏ ఇద్దరు కలిసినా ప్రథమంగా మాట్లాడేది రాజకీయమే. అది తమకు తెలిసిన ఎల్లలు వరకూ మాత్రమే.


కుల వ్యవస్థ అన్నది మధ్యతరగతి వర్గీయుల మధ్యన ఒక బలమైన గోడ లాగా నిలబడి ఉంది. కుల పట్టింపు ఎక్కువ. దీనికి రిజర్వేషన్ వ్యవస్థ కూడా కొంత కారణాన్ని కల్గి ఉంది. తమకు తాము తక్కువ తరగతిగా భావించే వారు, తమ స్థాయిని  పెంపొందించుకోవటానికి తమని తాము మధ్యతరగతి కుటుంబాలుగా తెలియబరచుకొంటారు.  (Naudet & George, 2018).


భారతీయ మధ్య తరగతి కుటుంబాలు లేదా సమాజం యొక్క లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అంతే కాకుండా అవి భారతీయ సిద్ధాంతాలతోనూ, జీవన స్రవంతిలోనూ మమేకమయ్యి ఉంటాయి. వీరు ఏదీ ప్రత్యేకంగా తమ కోసం ఫలానాది కావాలి అన్నట్టుగా ఉండదు. అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు. తాము కుటుంబ పరంగా, సమాజ పరంగా అభివృద్ధి  చెందితే దానంతట అదే దేశం కూడా అభివృద్ధి  చెందుతుంది. ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్నవారే కొన్ని పనులను చేపట్టగలరు, సమర్థవంతంగా పూర్తి చేయగలరు. ఈ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవడానికి లేదా తమ నైపుణ్యానికి సంబంధించిన కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ఎప్పుడూ ముందుంటారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని తమ పని ప్రదేశంలో అమలు చేయటానికి కానీ, సాటి వారికి నేర్పటానికి కానీ ముందుంటారు.   దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది.  ఇటువంటి ఉద్యోగులు, సాంకేతిక నిపుణులను కలిగి ఉన్నప్పుడు ఆ పారిశ్రామికవేత్త తన వ్యాపార విస్తరణకు సుముఖంగా ఉంటాడు. దీనికి పర్యవసానమే కొత్త ఉద్యోగాలు, సంపద సృష్టి వంటి బై ప్రోడక్ట్స్ ని పొందగలుగుతాం. ఇక్కడ ఒక విషయం.  ఉద్యోగులు వారి పని నైపుణ్యతలను మాత్రమే కాక ప్రభుత్వ పాలసీలు, ముడి సరుకు అందుబాటు వంటి ఇతర ప్రమాణాలు కూడా పరిగణనలోకి వస్తాయి.

బాధ్యత ఎరిగిన మధ్యత్రగతి వర్గం:

భారతీయ ప్రమాణాలకు సంబంధించి ఒక మధ్య తరగతి వ్యక్తి యొక్క ఆదాయం ఎంతో తెలుసా? సాలీనా 5 నుండి 30 లక్షలు. ఈ సంఖ్యలను మామూలుగా నిర్ణయించలేదు. 'పీపుల్ రీసెర్చ్ ఆన్  ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ(PRICE)' అనే సంస్థ సుదీర్ఘమైన సర్వే నిర్వహించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విధమైన సంపాదన కలవారు 2004-5 లో 14% ఉండగా అది 2020-21 కి 31% కి పెరిగింది. ఇవి సాధికారికమైన  లెక్కలు. ఈ పెరుగుదల అన్నది ఈ  తరగతి వారిపై భారతదేశం ఎంతగా ఆధారపడి ఉన్నదో నిరూపిస్తుంది. ఇది ఒకరకంగా చాలా సకారాత్మకమైన అడుగు నైపుణ్యం కల కార్మికులు, ఉద్యోగులు పెరిగితే దేశ పురోగతికి చాలా లాభదాయకం. నైపుణ్యత అన్నది వారి వారి పని చేసే ప్రదేశాలను బట్టి, క్షేత్రాలను బట్టి ఉంటాయి. లాయర్, డాక్టర్, వ్యాపారవేత్త, టీచర్, మేనేజర్, వీరందరినీ ఈ తరగతి కిందే పరిగణనలోకి తీసుకోవచ్చు.



తమ క్షేత్రాలలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త విషయాల పట్ల అవగాహన  ఉండటానికి, తనకి తెలిసిన దానికి మెరుగులు దిద్దుకోవటానికి. రెండూ కూడా చాలా అవసరం.

:ఉపసంహారం:

 ఉరుకుల పరుగుల జీవితంలో ఇతరులతో పోలిస్తే  వెనుక పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవటం అన్నది అత్యంత కీలకమైన అంశం. ఐతే తనను తాను మెరుగు పరుచుకోవటం అన్నది ఇంతకు ముందే మనం అనుకున్నట్లు ఈ తరగతి వారికి దైనందిన జీవితంలో ఒక భాగం కాబట్టి పెద్దగా శ్రమ ఉండదు.