మధ్యతరగతికి వైద్య సహాయం. (bharateeya madhyataragati. vaidya sahayam) (Working class in India and medical assistance):
పరిచయం:
ప్రస్తుతం భారత దేశం లో ఆరోగ్య సంరక్షణ అన్నది సింహ భాగం కార్పొరేట్ హాస్పిటల్స్(Corporate hospitals) చేతుల్లోనే ఉంది. ఇది జగమెరిగిన సత్యం. అందులో వింతేముంది? అంటే, వర్తమాన కాలంలో ఏదీ వింత కాదు. ఎందులోనూ వింత లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ ధాటికి తట్టుకుని నిలబడి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి.
భారత దేశానికి మధ్యతరగతి కుటుంబాలు బలమైన వెన్నెముక వంటివి. దేశపు ఆర్థిక విధానాలు, సామజిక పద్ధతులు ఇతరాలు అన్నీ ఈ కుటుంబాలను ఆధారం చేసుకునే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది అనుకుంటే అది ఉత్తమాటే. అసలు ఈ నిర్ణయాల వలన ప్రత్యక్షంగా ఈ తరగతికి జరుగుతున్న లాభం ఎంత? కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు వీరికి అండగా నిలుస్తున్నాయి?
మధ్యతరగతి కి వైద్య సహాయం:
మధ్యతరగతి కుటుంబం నెలసరి ఆదాయం. 45 నుండి 80 వేల మధ్యలో ఉంటుంది. కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటారు, ఈ గణాంకాలను వివిధ సర్వే సంస్థలు నిర్ధారించాయి. చక్కని ప్రమాణాలు పాటిస్తూ ఈ ఆదాయంతో జీవనాన్ని సాగించడం అన్నది కత్తి మీద సామే. ఈ సమయంలోనే అనుకోకుండా అవసరం వచ్చి, వైద్యం చేయించుకోవాలన్నా, ఏ ఐసీయూ లో ఉండవలసి వచ్చినా పరిస్థితి దుర్భరం.
ధనిక వర్గానికి ఎక్కడికైనా వెళ్లి వైద్య సేవలు పొందే ఆస్కారం ఉంటుంది, అది భారత దేశమైనా, వేరే దేశం అయినా. ఖర్చుకు వెనకాడే పరిస్థితి వారికి ఉండదు. ప్రపంచంలో పేరు మోసిన ఒక వైద్యుడిని భారతదేశానికి దాదాపు పదిరోజుల కోసం రప్పించి వైద్యం చేయించుకున్న కుటుంబం ఉన్నది. శషభిషలు వారికి అవసరం లేదు.
బీదవారికి ప్రభుత్వాల అండ సంపూర్ణంగా ఉంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి స్కీములు వారికి శ్రీ రామ రక్ష. ఆసుపత్రికి వెళ్ళటానికి వారు వెనుకాడ వలసిన పరిస్థితి అసలు ఉండదు.
సాంప్రదాయ ప్రభుత్వ ఉద్యోగికి గవర్నమెంట్ స్కీములే అండగా ఉంటాయి. CGHS వంటివి.
ఇరుక్కుని పోయెదల్లా మధ్య తరగతి జీవే. సాధారణంగా వీరు స్వయం ఉపాధి పొందుతూ ఉంటారు. లేదా చిన్న ప్రయివేట్ కంపెనీలలో పనిచేస్తూ ఉంటారు. వీరికి అవసరం వచ్చినప్పుడు ఎవరి సాయం అందదు. ధనవంతులలా విరివిగా ఖర్చు పెట్టి వైద్య సహాయాలను పొందలేరు. అట్లాగని బీదవారిలా ప్రభుత్వ సహాయమూ పొందలేరు. 78 మిలియన్ల నుండి 604 మిలియన్ల మధ్య ఉండే మధ్యతరగతి భారతీయులలో, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ సహాయం అందుతుంది.
ప్రతి కుటుంబానికి కూడా చిన్నదో పెద్దదో ఒక వాహనం ఉంటుంది. ఆ వాహనానికి ఇన్సూరెన్స్ అన్నది ఉండవలసిందే. అది తప్పనిసరి. అదే విధానాన్ని కుటుంబాలకు కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే వీరికి ఇన్సూరెన్స్ ఆవశ్యకత తెలియజేయటం సులభం.
పోలిక:
ప్రపంచంలోని చిన్న దేశాలు కూడా తమ ప్రజలకోసం రకరకాల ఆరోగ్య పథకాలను ప్రవేశ పెట్టాయి. థాయ్ ల్యాండ్(Thailand) తమ ప్రజల కోసం ఇటువంటి స్కీములు నడుపుతోంది. ఇందులో ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రయివేట్ భాగస్వామ్యం (Public private partnership) కలిసి ఉంటాయి. UK యొక్క NHS ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తుంది. అమెరికాలో కూడా. ఈ విధానం వల్ల మధ్యతరగతి వారి హెల్త్ కేర్ పైన ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
ఉదాహరణకు ప్రస్తుతం నలుగురు సభ్యులున్న కుటుంబంలో 5 లక్షల ఇన్సూరెన్స్ కు గానూ, 15 నుండి 20 వేల వరకూ ప్రీమియం చెల్లించవలసి వస్తోంది. అంటే సగటున నెలకి 15 నుండి 16 వందల వరకూ పెట్టవలసి వస్తోంది.
దురదృష్టవశాత్తూ మనం అమెరికా లాగానో, UK లాగానో వైద్య సహాయం అందించలేము. కొత్త కొత్త ప్రభత్వ స్కీములను ప్రవేశపెట్టలేము. కారణం ఒక్కటే. మన పన్నుల విధానం అస్తవ్యస్తంగా ఉండటమే. జనమే తమకు తాము సహాయం చేసుకోవాలి. తమ అవసరాన్ని బట్టి ఇన్సూరెన్స్ స్కీమ్ ఎన్నుకొని దానికి అవసమైన ప్రీమియం కట్టుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మంచి డాక్టర్లను నియమించుకోవాలి. అంతేకాక క్వాలిటీ సర్వీస్ ను అందించగలగాలి
ప్రభుత్వాలూ, ప్రైవేట్ సెక్టార్ రెండు కలిసి సమన్వయంతో పని చేయాలి. సాధారణ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి. తమకు ఒక నమ్మకమైన, సురక్షితమైన ఆరోగ్య సేవ అందుతుందని. పెద్దదైన ఫైవ్ స్టార్ హాస్పిటల్ అవసరం లేదు. ప్రత్యేకమైన సూట్ రూమ్స్ అవసరం లేదు. కావలసినదల్లా ప్రామాణికత గల సేవ. అంతే. ప్రయివేట్ సంస్థలకు, ప్రజలకు ఇది ఎంతగానో లాభదాయకం. ఎందుకంటే నేటి పరిస్థితిలో హాస్పిటల్స్ పేషేంట్స్ ని పేషేంట్స్ గా కాక, కస్టమర్స్ గా చూస్తున్నాయి.
ఉపసంహారం:
గవర్నమెంట్ ఆసుపత్రు(Government hospitals) లలో నిజానికి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. వారి పని తీరు అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్యల్లా డాక్టర్ల పై, మిగతా సిబ్బంది పైన అత్యంత పని ఒత్తిడి. దీనికి తోడు ఒక్కొక్క చోట ఒక్కొక్క డిపార్టుమెంటు. తిరగవలసి వస్తుంది. వెళ్లిన చోటల్లా పెద్ద లైన్లు. ఇటువంటివి ఎంతగానో నిరుత్సాహ పరుస్తాయి. ఇటువంటి పరిస్థితులను మెరుగుపరచాలి. దీనికి కొరకు NGO ల సహాయం తీసుకోవాలి.
