భారతదేశంలో జానపద సంగీతం(Bharatadeshamlo janapada sangeetham)(Indian Folk music):

పరిచయం: 

ప్రపంచానికి పూజగది అయినటువంటి భారతదేశం వేదకాలం నుండి సంగీతానికి ప్రాముఖ్యాన్నిచ్చింది.  సామవేదం(Sama veda)లో సంగీతానికి నిర్వచనం ఇవ్వటమే కాక, సంగీతం యొక్క పరిధులు, విశిష్టత, విశ్లేషణ, ప్రాముఖ్యత లను కూలంకషంగా వివరించింది.

జానపద ప్రక్రియకు మూలం:

'భావగీతే'(Bhavageethe) అనే ప్రక్రియ భారతీయ జానపద సంగీతం(Indian folk music)లోని ఒక భాగం. ఇది అత్యంత పురాతనమైన ప్రక్రియ. కర్ణాటక, మహారాష్ట్ర  ప్రాంతాలలో ఇప్పటికీ ఈ సంగీతం అందుబాటులో ఉంది. జానపద సంగీతం అన్నది భారతీయులకు చాలా ఇష్టమైన ప్రక్రియ. ఏ ప్రాంతపు పాటనైతే వింటామో, ఆ ప్రాంతపు గ్రామీణ భాషలు, ఈ పాటను అలంకరించే ప్రక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అసలు జానపదానికి మూలమే ఆ ప్రాంతపు మట్టి.  జానపదం అన్న పద ప్రయోగం వికృతి కాగా, జనపదం అన్నది ప్రక్రుతి.


జనము అంటే ఆ ప్రాంతపు మనుషులు. వారి కష్టం, సంతోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ ప్రాంతపు గ్రామ దేవత, వారి కుల దేవత, కోడలి పై అత్తగారి దాష్టీకం, ఆ ప్రాంతపు పెద్ద లేదా దొర లేదా పోలీస్ పటేల్ యొక్క జులుం, కొత్తగా కొనుక్కున్న పశువులు వాటి అందం, వాటి పనితనం, పంట చేలకు నీరు పట్టడం, పురుగుకు మందు కొట్టడం, తిరుమల వేంకటేశ్వరుడు, యాదగిరి నారసింహుడు వంటి దేవుళ్ళ అందచందాలు, సంసారంలో కష్టాలు, పల్లె ప్రజలు పట్టణానికి వెళితే పడే అగచాట్లు ఇట్లా సాగుతాయి వారి పాటలు.

 ప్రధానంగా ఈ పాటలను కార్మికులు తమ పని ప్రదేశాలలో పాడుతారు. చేస్తున్న పనిలో అలుపు తెలియకుండా ఉంటుంది. అంతేకాకుండా తామొక్కరమే కాకుండా మరికొందరు, ఒకరితో మరొకరు కలిసి పని చేస్తున్నామన్న భావన తమలో నిండి ఉండటం వల్ల చేస్తున్న పని మరింత సులువుగా అవుతుంది. నిజానికి ఈ సంగీతం ఆ జాతి యొక్క పూర్వీకుల కీర్తిప్రతిష్టలను, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తమ జాతిలోని చారిత్రక పురుషుల కథలను, ఇతిహాసాలను కీర్తిస్తాయి. ఇలా ఒక తరం నుండి మరొక తరానికి తమ తమ జాతి వారి గొప్పతనాలను, చేసిన కార్యాలను చేరవేసుకుంటూ ఉంటారు.

మూలాలు:

సామాన్య శకానికి 3000 ఏళ్ల ముందే ఈ సాంప్రదాయ సంగీతానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సంగీతానికి ఉపయోగించే తప్పెట గుళ్ళు, కాలి గజ్జెలు, నడుము పట్టీలు, కంజీర లేదా డప్పు, వాయిద్యాలను తయారు చేయటానికి ఉపయోగించే జంతు చర్మం, నాట్యం చేసేటప్పుడు తలపై పెట్టుకునే ఒక విధమైనటువంటి కుండ వంటి పరికరం ఇటువంటి సాధనాలు భారతదేశ వ్యాప్తంగా అనేక తవ్వకాలలో బయట పడ్డాయి. కొన్ని చోట్ల జానపద సంగీతపు రచనలు కూడా కనిపించాయి.


దీని వల్ల మనకు తెలిసి వచ్చేదేమంటే మన పూర్వీకులు కూడా సంగీతానికి, జానపద సంగీతానికి సముచితమైన స్థానాన్ని ఇచ్చారని తెలుస్తోంది.
మొట్టమొదటగా సంగీతం గుడుల(Temple) లో పాడేవారు. ఇవి భక్తిని, భగవంతునిపై ప్రేమరసాన్ని పెంపొందించేవి. ఏ గుడిలో అయితే  ప్రదర్శన సాగుతున్నదో ఆ భగవంతుడిపై సంగీతం, పాటలు కొనసాగేవి. క్రమంగా అవే పాటలు కార్మికులు పని చేసే చోటికి కూడా వచ్చి చేరాయి. ముందు ఈ పాటలు ఆయా ప్రాంతాలకు చెందిన గ్రామదేవతల పై, కుల దేవతలపై ఉండేవి. అవే క్రమంగా రూపాంతరం చెంది అనేకానేక భావాలను వ్యక్తం చేయటం ప్రారంభించాయి. ఈ పాటలు పని చేసే కార్మికులకు ఉత్తేజాన్ని ఇవ్వటమే కాక, శ్రమను తెలియకుండా చేస్తాయి. ఎంతో ఆకర్షణీయంగా కట్టిన బాణీలలో తమ తమ దైనందిన జీవితాలలోని కష్ట సుఖాలను మిళితం చేస్తూ పాడుతారు.
కూర్పు ఎలా?:

సాధారణంగా ఈ పాటలలో పల్లవి ఎంతో బలంగా ఉంటుంది. ఇందులోనే తాము చెప్పదలచుకున్న విషయం చెప్పేస్తారు. తరువాత వచ్చే చరణాలలో కొంత విషయాన్ని జొప్పించి మళ్ళీ దానిని పల్లవితో అనుసంధానించి పాడుతారు. ఈ ప్రక్రియ ఎంతో హృద్యంగా ఉంటుంది. కరోనా కష్టకాలంలో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్న కార్మికులను గురించి 'ఆదేశ్ రవి' పాడిన పాట విన్నారా?


‘ముసలి తల్లీ..’ అంటూ సాగే ఆ పాటలో రోజువారీ మాట్లాడే మాట్లాడే మాటలే వాడాడు రచయిత. కానీ ఆ పదాలను కూర్చటం, అనుభూతి చెందటం అన్నవి ఆ పాటకు ప్రాణం పోశాయి. చౌరస్తా రామ్, శివరాత్రి రోజున సద్గురు(Sadguru) నిర్వహించిన కార్యక్రమంలో పాడిన 'మట్టేరా జీవమున్న బంగారం' కూడా వినే ఉంటారు. వాడిన పదాలు, పాడిన గొంతు మట్టి వాసనకు దగ్గరగా ఉండటం అన్నది జానపడానికి ఎంత ముఖ్యమో కళ్ళకు కట్టినట్టు తెలియజేస్తుంది. వంగపండు ప్రసాద్ పాడిన 'ఏం పిల్లో ఎల్దామోస్తావా' వినే ఉంటారు. అందులోనూ మనకు శ్రామికులకు ఇష్టమైన పదాలు, ఆప్యాయత కనపడతాయి.

జానపద ప్రక్రియలు:

నిజానికి భారత్ లోని వివిధ రాష్ట్రాలలో ఈ జానపద సంగీత బాణీలు ఎంతో పేరుప్రఖ్యాతలు, ఆయా రాష్ట్రాలకు సంపాదించి పెట్టాయి. అస్సామ్ లో బిహుగీత్ ప్రక్రియ లోకప్రియం. సంగీత దర్శకుడు 'భూపేన్ హజారీకా' ఇందులో ప్రసిద్ధి చెందిన వాడు. బెంగాలీ వారి 'బాల్'(Baul), మరాఠీల 'లావణీ'(Lavani), ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలోని 'పాండవని', కర్ణాటక 'భావగీత'(Bhavageetge), తమిళుల 'నట్టుపూర పూరపట్టు', రాజస్థానీల 'మాండ్' ప్రసిద్ధి పొంది ఉన్నాయి.నాగాలాండ్ వారి 'జెలియాంగ్' అద్భుతమైన జానపద ప్రక్రియ. ఇక ఆంధ్రప్రదేశ్ కి చెందిన 'కోలాటం'(Kolatam) గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ప్రతి ఉత్సవంలోనూ మనం ఈ జానపద ప్రక్రియను చూస్తూనే ఉంటాం!! ఈ జానర్ లో గురుశిష్య పరంపర వంటి సాంప్రదాయ పద్ధతులు ఏమీ ఉండవు. ఒకరి ద్వారా విని మరొకరు నేర్చుకొని ఆలాపించడమే. ఇటీవల ఎంతో ప్రసిద్ధి పొందిన 'సారంగదరియా' దాదాపు వందేళ్ల కిందటి సాహిత్యం. ఈ సాహిత్యాన్ని ఎక్కడా గ్రంధస్తం చేయకపోవటం వల్ల, మంచి విలువైన పాటలను, సాహిత్యాన్ని కోల్పోవటం జరిగింది. వర్తమానంలో మెజారిటీ పాటలను గ్రంధస్తం చేయటం అన్నది నిజంగా ఆనందకరమైన విషయం.

ఎందరో మహానుభావులు:

తెలుగులో గ్రంధస్తం ఐన మొదటి నాళ్ళల్లో పాటలు అన్నమాచార్యవే. ఆయన రాసిన కీర్తనలలో అధికం జానపద బాణీలలోనే ఉంటాయి. 'అదివో, అల్లదివో', 'బ్రహ్మమొక్కటే', 'తందనాన ఆహి' వంటి వన్నీ ఈ కోవలోకే వస్తాయి. అద్భుతమైన  సాహిత్యం  కదా!! అప్పటికీ ఆయన రాసిన కొన్ని వందల పాటలు కనపడకుండా పోయాయి. మిగిలిన సాహిత్యమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నది.

భారతదేశం గర్వించే జానపద గాయకులతో కొందరు. మాలిని అవస్థి, వింజమూరి అనసూయ దేవి, ఇలా అరుణ్(Ila arun),  ప్రహ్లాద్ తపాణియా, రఘు దీక్షిత్. ఇవి కేవలం కొన్ని పేర్లు మాత్రమే సుమా. ఇంకా ఎందరో జానపద కళాకారులు ఉన్నారు. 

ముగింపు:

ఎటువంటి సంగీత కళాప్రక్రియ ను ఇష్టపడే వారికైనా సరే జానపద సంగీతం ఒకరకమైన ఊరటనిస్తుంది. అందులోని పల్లె భాష, వాడిన నాయిద్యాలు, పల్లె నాటుదనమున్న స్వరాలు కట్టిపడేస్తాయి. పరాకుగా ఉన్నవారు తప్పక వినవలసిన ప్రక్రియ ఈ జానపదం. మనసు లోతుల్లో ఎక్కడో రికార్డ్ అయ్యి, మనకు తెలియకుండానే పెదాలపై పలుకుతూ ఉంటాం. ఇదే ఈ పాటకు ఆయువు పట్టు.